ACB | హెచ్ఎండీఏ డైరెక్టర్ శివ బాలకృష్ణ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. శివ బాలకృష్ణ ఇల్లు సహా 18 చోట్ల ఏసీబీ సోదాలు నిర్వహించి.. భారీగా ఆస్తుల గుర్తింలను గుర్తించింది. 50 ప్రాపర్టీస్ డాక్యుమెంట్లను ఏసీబీ గుర్తించింది. ఆస్తుల డాక్యుమెంట్లను పరిశీలించగా.. బహిరంగ మార్కెట్లో రూ.5కోట్ల వరకు ఉంటుందని అంచనా. రూ.99లక్షల నగదు, రూ.51లక్షల విలువైన నాలుగు కార్లు, రూ.58లక్షల బ్యాంక్ బాలెన్స్, రూ.8.26కోట్ల విలువైన బంగారు, వెండి ఆభరణాలు, వాచ్‌లు, ఫోన్లు, గృహోపకరణాలను సీజ్ చేసినట్లు ఏసీబీ అధికారులు రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు.
అంతే కాకుండా పలు ఇన్ఫ్రా కంపెనీల్లోనూ సోదాలు జరిపినట్లు ఏసీబీ పేర్కొంది. 155 డాక్యుమెంట్ షీట్స్, నాలుగు పాస్‌బుక్‌లు స్వాధీనం చేసుకున్నామని రిపోర్టులో పేర్కొంది. ఎల్ఐసీ బాండ్స్, 20 ఐటీ రిటర్న్ డాక్యుమెంట్స్‌తో పాటు నాలుగు బ్యాంకు పాస్‌బుక్‌లు స్వాధీనం చేసుకున్నామని.. బినామీలను విచారించాల్సి ఉందని ఏసీబీ పేర్కొంది. అలాగే, ఇతర అధికారుల పాత్రపై దర్యాప్తు జరగాల్సి ఉందని రిమాండ్ రిపోర్ట్‌లో ప్రస్తావించింది. ఈ సందర్భంగా పలువురు బినామీలను గుర్తించిన ఏసీబీ.. ఫీర్జాదిగూడలో పెంట రమాదేవి, మైహోం భుజాలో కిరణ్ ఆచార్య, జూబ్లీహిల్స్‌లో మాదాపూర్‌లో కొమ్మిడి సందీప్‌రెడ్డి, బాచుపల్లిలో సత్యనారాయణ మూర్తి నివాసాలతో సహా 18 చోట్ల సోదాలు నిర్వహించినట్లు వివరించింది.