AEE Nikesh Kumar | హైదరాబాద్ నాంపల్లి డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ): లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ పట్టుబడిన ముగ్గురు అధికారుల్లో ఒకడు.. నీటిపారుదలశాఖలో ఏఈఈ హేరూర్ నికేశ్ కుమార్. చిన్న అవినీతిగా భావించిన అధికారులకు దిమ్మతిరిగే నిజాలు తెలుస్తున్నాయి. నికేశ్కుమార్ ఆస్తుల పుట్టను తవ్వుతుంటే అధికారులు కూడా నివ్వెరపోతున్నారు. రాష్ట అవినీతి నిరోధకశాఖ చరిత్రలోనే రెండో అతిపెద్ద అవినీతి అధికారి హేరూర్ నికేశ్కుమార్ అని దర్యాప్తులో స్పష్టంచేశారు. నికేశ్ లంచాలతో కూడబెట్టిన స్థిర, చరాస్తులు మార్కెట్ విలువ సుమారు రూ.600 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా వేశారు.
నికేశ్కుమార్ చెరువులు, జలాశయాల బఫర్ జోన్లలో భవన నిర్మాణాలకు అనుమతులు ఇస్తూ వందల కోట్ల రూపాయలు కూడబెట్టినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. నానక్రామ్గూడలోని వాసవి అంట్లాటీస్, మైరాన్విల్లా, బ్లిస్, కంపిల్ ఇన్ఫ్రా, సాస్, రాయిచాందనీలలో ఖరీదైన విల్లాలు నికేశ్కుమార్ పేరుమీద ఉన్నట్టు తెలిసింది. వీటితోపాటు నార్సింగిలో నాలుగు అంతస్తుల హాస్టల్ భవనం ఉన్నట్టు అధికారులు గుర్తించారు. మొయినాబాద్లో ఆరున్నర ఎకరాల్లో మూడు ఫామ్ హౌస్లు, తాండూరులో మూడెకరాల వ్యవసాయ భూమి ఉన్నట్టు తెలుస్తున్నది.
నికేశ్ కుమార్ ఇంట్లో, బంధువుల నివాసాల్లో కేజీకి పైగా బంగారాన్ని ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్న అధికారులు ఇవాళ నికేశ్ బినామీలు, బంధువులు, స్నేహితులకు చెందిన ఏడు లాకర్లను తెరవనున్నారు. గతంలో ఏసీబీకి చిక్కిన సీసీఎస్ మాజీ ఏసీపీ ఉమామహేశ్వరరావుతో కలసి నికేశ్ కుమార్ పలు సెటిల్మెంట్లు చేసినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. రియల్ ఎస్టేట్లోనూ పెద్దపెద్ద పరిచయాలు ఉన్నట్టు తెలుస్తున్నది. మొత్తానికి ఏసీబీ చరిత్రలోనే రెండో అతిపెద్ద ఆదాయానికి మించిన ఆస్తుల కేసుగా భావిస్తున్న ఏసీబీ.. మరికొన్ని అరెస్టులు చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఏసీబీ చరిత్రలో టాప్ 3 కేసుల్లో దేవికరాణీ, నికేశ్ కుమార్, శివబాలకృష్ణగా చెబుతున్నారు.
పదేండ్ల క్రితం నీటిపారుదలశాఖలో ఉద్యోగిగా నికేశ్ కుమార్ 2021 నుంచి గండిపేట జోన్లో విధులు నిర్వహిస్తున్నాడు. శివారుప్రాంతం కావడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతున్నది. చెరువులు, కుంటల సమీపంలో నిర్మాణాలు చేపట్టేందుకు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ నిబంధనలు ఆటంకంగా ఉండటంతో పెద్ద మొత్తంలో వసూలు చేసి ఎన్ఓసీ ఇచ్చేలా డీల్ చేసుకునేవాడు. ఒకో ఎన్ఓసీకి రూ.50 లక్షల వరకు కూడా వసూలు చేసినట్టు సమాచారం. వసూలు చేసిన మొత్తంలో సగానికిపైగా తాను తీసుకుని మిగిలిన దాంట్లో పైఅధికారులకు వాటాలు ఇచ్చేవాడని తెలుస్తున్నది.
కొత్తూరు మండలం సిద్దాపూర్లో రూ.2.50 కోట్ల విల్లాను నికేశ్ కొన్నట్టు ఏసీబీ గుర్తించింది. ఇరిగేషన్ విభాగంలో నికేశ్తో పాటు పనిచేసే మరో ఐదుగురికి కూడా అకడే విల్లాలు ఉండటంతో వారిని కూడా ఏసీబీ విచారించనున్నది. అక్రమంగా సంపాదించిన డబ్బుకు బినామీలుగా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న తన చిన్ననాటి స్నేహితులను, బంధువులను ఎంచుకున్నట్టు తెలిసింది. అటు ఏసీబీ అధికారులు నిందితుడిని న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చగా 14 రోజుల రిమాండ్ విధించారు.