AEE Nikesh | హైదరాబాద్, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ): ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో ఏసీబీకి పట్టుబడిన నికేశ్కుమార్ సంతకం ఖరీదు లక్షల రూపాయలు అని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. అతను రోజుకు కనీసం 2 లక్షల రూపాయలు లంచంగా ఇంటికి తీసుకెళ్లాలని టార్గెట్గా పెట్టుకున్నట్టు తెలిసింది. నీటిపారుదలశాఖ ఏఈఈగా అక్రమాలకు పాల్పడిన నికేశ్కుమార్ను విచారించేందుకు గురువారం నాలుగు రోజుల కస్టడీకి తీసుకున్న ఏసీబీ అధికారులు చంచల్గూడ జైలు నుంచి నాంపల్లి ఏసీబీ కార్యాలయానికి తరలించారు. మొదటిరోజు విచారణలో ఏసీబీ అధికారుల ప్రశ్నలకు నికేశ్ పొడిపొడిగానే సమాధానాలు చెప్పినట్టు తెలిసింది.
ఇప్పటికే నికేశ్ స్నేహితుల బ్యాంక్ లాకర్ల నుంచి బంగారం, కీలక పత్రాలు స్వాధీనం చేసుకోగా గురువారం నికేశ్ సమక్షంలోనూ పలువురు బినామీల బ్యాంకు లాకర్లు తెరిచినట్టు సమాచారం. నికేశ్ కేసులో ఏసీబీ అధికారులు ఇప్పటికే రూ.17.73 కోట్ల అక్రమాస్తులను గుర్తించారు. వీటి మార్కెట్ విలువ వందల కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. నికేశ్ వెనుకాల ఎవరైనా ఉన్నారా? అతడు ఎవరికైనా బినామీగా ఉన్నాడా అనే కోణంలోనూ దర్యాప్తు సాగుతున్నట్టు తెలుస్తున్నది.