హైదరాబాద్, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ): అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు రాష్ట్రంలో ఈ ఏడాది 170 మంది అధికారులను అవినీతికి పాల్పడుతుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్టు తెలిసింది. ఈ జాబితాలో పోలీసులే అత్యధికంగా ఉండటం విశేషం. వీరి తరువాతి స్థానంలో వరుసగా పంచాయతీరాజ్, రెవెన్యూ, స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖల అధికారులు ఉన్నారు. కానిస్టేబుల్ నుండి డీఎస్పీ స్థాయి వరకు 31 మంది పోలీసులు లంచం తీసుకుంటూ ఏసీబీ చేతికి చిక్కినట్టు సమాచారం. పంచాయతీ రాజ్శాఖకు చెందిన 24 మంది అధికారులు, రెవెన్యూశాఖ నుంచి 19 మంది, స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి 13 మంది అధికారులు ఉన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. అవినీతికి పాల్పడిన పోలీసు అధికారుల్లో సంగారెడ్డికి చెందిన ఒక ఇన్స్పెక్టర్ రూ.1.5 కోట్ల లంచం డిమాండ్ చేసి, రూ.5 లక్షలు తీసుకుంటుండగా దొరికిపోయాడు. హైదరాబాద్ సీసీఎస్‌కు చెందిన ఒక ఇన్స్పెక్టర్ ఓ కేసుకు సంబంధించి రూ.15 లక్షల లంచం డిమాండ్ చేసి, రూ.3 లక్షలు తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. కుషాయిగూడకు చెందిన మరో పోలీస్ ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్ ఓ కేసును మూసివేయడానికి రూ.3 లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు.
భారీ ఎత్తున అక్రమాస్తుల గుర్తింపు
అవినీతికి పాల్పడిన అధికారుల ఆటకట్టించడంలో ఏసీబీ అధికారులు ఈ ఏడాది పురోగతి సాధించారు. ముఖ్యంగా మూడు భారీ అవినీతి తిమింగళాలను బట్టబయలుచేసి వారి అక్రమాస్తులను ప్రజలకు వివరించడంలో విజయం సాధించారు. ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ముందువరుసలో ఉన్నారు. ఆయన వద్ద 214 ఎకరాల భూమి, 29 ప్లాట్లు, బ్రాండెడ్ వాచ్‌లు, ఐఫోన్లు వంటి విలాసవంతమైన వస్తువులతో సహా రూ.250 కోట్ల విలువైన ఆస్తులను కనుగొన్నారు. ఆ తర్వాత నీటిపారుదల శాఖ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా పనిచేసిన నికేశ్‌కుమార్ నుంచి సుమారు రూ.100 కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ సీసీఎస్‌కు చెందిన ఒక ఏసీపీ నుంచి రూ.3.95 కోట్ల విలువైన అక్రమ ఆస్తులను ఏసీబీ అధికారులు కనుగొన్నారు. ఇక లంచాలు తీసుకున్న కేసుల్లో 12 మంది అధికారులు దోషులుగా నిర్ధారణ అయ్యారు. వారికి ఏడాది నుంచి నాలుగేండ్ల వరకు జైలు శిక్షలు పడ్డాయి.