జయశంకర్ భూపాలపల్లి : ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూగర్భ గనుల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ బొజ్జ జయరాజ్ ఇంటిపై వరంగల్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య ఆధ్వర్యంలో గురువారం ఉదయం నుంచి సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లోని బోడుప్పల్, సూర్యాపేట, తాండూర్ లతో పాటు ఆయన పనిచేస్తున్న భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం సహా మొత్తం 12 ప్రాంతాల్లో ఏసీబీ బృందాలు ఏకకాలంలో తనిఖీలు చేపట్టాయి.
భూపాలపల్లి ఏడీ కార్యాలయంలో ప్రస్తుతం ఏసీబీ ఇన్ స్పెక్టర్ ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో సోదాలు నిర్వహిస్తున్నారు. జయరాజ్ ఇటీవలే స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఉత్తమ అధికారిగా అవార్డు అందుకున్నారు. ములుగు, భూపాలపల్లి జిల్లాలో ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్న కొందరితో జయరాజ్ కుమ్మక్కయ్యారన్న ఆరోపణలు గతంలో అనేకసార్లు వెళ్లువెత్తాయి. ఈ వ్యవహారంలో అక్రమంగా ఆస్తులు కూడబెట్టరా..? అనే కోణంలో ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది.