అలంపూర్ చౌరస్తా, ఫిబ్రవరి 14 : ఓ వెంచర్ యజమానుల నుంచి రెండు లక్షలు లంచం తీసుకుంటూ జిల్లా పంచాయతీ అధికారి, గ్రామ పంచాయతీ కార్యదర్శి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఈ ఘటన జోగుళాంబ గద్వాల జిల్లాలో శుక్రవారం చోటుచేసుకున్నది. ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ కథనం ప్రకారం.. ఉండవల్లి మండలం పుల్లూరు శివారులోని హైవే పక్కనే అన్నపూర్ణ గ్రీన్‌హిల్స్ వెంచర్లో గ్రామ పంచాయతీకి తనఖా పెట్టిన ప్లాట్లను అనుమతుల్లేకుండా సబ్‌రిజిస్ట్రార్ అధికారుల సహకారంతో వెంచర్ యజమానులు ఓ బిల్డర్‌కు రిజిస్టర్ చేసినట్టు ఫిర్యాదులు అందాయి. దీంతో డీపీవో శ్యాంసుందర్.. పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్ కుమార్‌రెడ్డి చేత వెంచర్ యజమానులకు నోటీసులు ఇప్పించాడు.
తర్వాత వెంచర్ యజమానులు కార్యదర్శిని ఆశ్రయించగా.. రూ.3 లక్షలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. చివరకు డీపీవోకు రూ.1.50 లక్షలు, కార్యదర్శికి రూ.50 వేలు ఇచ్చేలా ఒప్పందం కుదిరింది. శుక్రవారం ఉండవల్లి మండలం బూడిదపాడు శివారులో పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్‌కుమార్‌రెడ్డికి వెంచర్ యజమానులు డబ్బులు అందించగా.. కార్యదర్శి వెంటనే డీపీవోకు సమాచారం చేరవేశాడు. ఏసీబీ అధికారులు కార్యదర్శిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అలాగే డీపీవోను కూడా అదుపులోకి తీసుకొన్నారు. జిల్లా పంచాయతీ శాఖ కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. శ్యాంసుందర్, ప్రవీణ్‌కుమార్‌రెడ్డిపై కేసు నమోదు చేసినట్టు ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ తెలిపారు.