ADE Satish | హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 15(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ గచ్చిబౌలిలోని విద్యుత్ శాఖలో ఏడీఈగా పని చేస్తున్న సతీశ్ 50 వేలు లంచం తీసుకుంటూ శుక్రవారం ఏసీబీకి పట్టుబడ్డాడు. ఏసీబీ అధికారులు 2 రోజులపాటు మాదాపూర్‌లోని సతీశ్ నివాసంతో పాటు పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఆరునెలల క్రితమే సతీశ్ పెద్ద ఎత్తున పైరవీ చేసుకుని గచ్చిబౌలికి ఏడీఈగా వచ్చినట్టు తెలుస్తున్నది.
సతీశ్‌కు హైదరాబాద్, కరీంనగర్, రంగారెడ్డి జిల్లాల్లో 22 ఎకరాల వ్యవసాయ భూమి, విల్లా, ఓపెన్‌ప్లాట్లు, భవనాలు ఉన్నట్టు గుర్తించారు. నగరంలో ఉన్న కమర్షియల్ కాంప్లెక్స్‌లతో ప్రతీ నెల లక్షల రూపాయల కిరాయిలు వస్తాయని అధికారుల విచారణలో తెలిసింది. సతీశ్ ఆస్తుల విలువ రూ.100కోట్లకు పైగానే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. సతీశ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్టు తెలిపారు. కస్టడీకి తీసుకుని విచారిస్తే మరిన్ని వివరాలు తెలిసే అవకాశముంటుందని చెప్తున్నారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ): లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన వికారాబాద్ జిల్లా ధరూర్ ఎస్సై వేణుగోపాల్‌ను ఐజీ సత్యనారాయణ సస్పెండ్ చేశారు. ఈ మేరకు మల్టీజోన్-2 ఐజీ ఆఫీస్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 11న ఓ కేసు విషయంలో స్టేషన్ బెయిల్ మంజూరు కోసం ఎస్సై రూ.30 వేల లంచం డిమాండ్ చేసినట్టు ఏసీబీకి ఫిర్యాదు అందింది. ఎస్ఐ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో విచారణ చేపట్టిన ఐజీ సత్యనారాయణ ఎస్సైని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు వెలువరించారు.