హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 4 (నమ స్తే తెలంగాణ): హెచ్ఎండీఏ ప్లానింగ్ విభాగం మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ అక్రమ సంపాదనకు సహకరించిన సహచర అధికారులు, కింది స్థాయి సిబ్బంది ఎవరు? అనేది ఏసీబీ అధికారులు కూపీ లాగుతున్నారు. నాలుగు రోజుల కస్టడీలో కుటుంబసభ్యులతోపాటు బంధుమిత్రుల పాత్రను అధికారులు గుర్తించారు. ఇంకా విచారణకు సమయం ఉండటంతో ప్లానింగ్ విభాగంలో సహకరించిన అధికారులు ఎవరెవరు? అని ప్రశ్నిస్తున్నారు. దీంతో ప్రస్తుతం పనిచేస్తున్న అధికారుల్లో భయాందోళన నెలకొన్నది. హెచ్ఎండీఏ పరిధిలో మొత్తం నాలుగు జోన్లు ఉన్నాయి. అందులో మూడు జోన్లకు డైరెక్టర్-1గా శివ బాలకృష్ణ ఉన్నారు. ఇందులో శంకర్పల్లి, శంషాబాద్, ఘట్కేసర్ ఉండగా, వీటిలోనే పెద్దమొత్తంలో భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులు ఇచ్చారు.
మరో జోన్ అయిన మేడ్చల్ పరిధిలోనూ భారీ బహుళ అంతస్థుల నిర్మాణాల వ్యవహారాలను ఆయన నిర్వర్తించేవారు. హెచ్ఎండీఏలో సింహభాగం భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులన్నీ ఆయన కనుసన్నల్లోకి జరిగినట్టు తెలుస్తున్నది. 2018 నుంచి 2023 జూ లై వరకు మూడు జోన్ల పరిధిలో ప్లానింగ్ ఆఫీసర్స్‌గా పనిచేసిన అధికారులు, వారి కింది స్థాయి లో ఏపీవో, జేపీవో స్థాయి అధికారులు సహకరించడం వల్లే శివబాలకృష్ణ పెద్ద మొత్తంలో ఆస్తులను కూడబెట్టాడనే విషయం ఏసీబీ విచారణ లో వెల్లడవుతున్నది. ఆ అధికారులను గుర్తించే పనిలో ఏసీబీ నిమగ్నమైంది. శంషాబాద్ ప్లానిం గ్ ఆఫీసర్ (పీవో)గా గతంలో ఏపీవోనే ఇన్చార్జిగా నియమించి చాలా పనులు చక్కబెట్టారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ఆ అధికారి సెలవులో ఉన్నారని, శివబాలకృష్ణపై ఏసీబీ దాడులు మొదలైనప్పటి నుంచి ఆయన హెచ్ఎండీఏ ఆఫీ సుకు రావడం లేదని ఉద్యోగులు చెప్తున్నారు.