హైదరాబాద్, జనవరి 3 (నమస్తే తెలంగాణ) : ఫార్ములా-ఈ కేసులో విచారణకు హాజరు కావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావుకు రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) నోటీసులు జారీచేసిం ది. ఈ నెల 6న ఉదయం 10 గంటలకు తమ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. కేటీఆర్‌తోపాటు సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్‌కుమార్, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్‌ఎన్‌రెడ్డిని కూడా రావాలని పేర్కొంది.
ఏసీబీ నోటీసులకు స్పం దించే విషయంలో కేటీఆర్ న్యాయ నిపుణులను సంప్రదించి నిర్ణయం తీసుకోకున్నట్టు తెలిసింది. ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని కోరుతూ కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ ముగించిన హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది. తీర్పు వెలువడే వరకూ కేటీఆర్‌పై ఎటువంటి చర్యలూ తీసుకోవద్దని ధర్మాసనం ఏసీబీని ఆదేశించింది.
అయినప్పటికీ ఏసీబీ కేటీఆర్‌కు నోటీసులు ఇచ్చింది. ఇదే కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఈ నెల 7న విచారణకు రావాలని కేటీఆర్‌ను ఆదేశించింది. ఈ కేసులో ఏ2గా ఉన్న ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డి (ఏ3)లకు కూడా నోటీసులు జారీ అయ్యాయి.