హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ): ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై విచారణను విజయవాడ ఏసీబీ కోర్టు బుధవారానికి వాయిదా వేసింది. ఈ పిటిషన్లపై మంగళవారం విచారణ జరుగాల్సి ఉండగా.. న్యాయమూర్తి సెలవులో ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉండగా అంగళ్లు కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. కాగా హైకోర్టు తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. అంగళ్లు కేసులో చంద్రబాబు ఏ-1 నిందితుడు. నీటి పారుదల ప్రాజెక్టుల సందర్శనకు వెళ్తున్న సమయంలో.. అంగళ్లు వద్ద రెండువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకున్న విషయం తెలిసిందే.
అమరావతి ఇన్నర్‌రింగ్ రోడ్డు కేసులో టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేశ్ పేరును చేరుస్తూ ఏపీ సీఐడీ ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేసింది. ఈ కేసులో చంద్రబాబు ఏ1 నిందితునిగా ఉన్నారు. తాజాగా లోకేశ్ పేరును ఏ14గా చేర్చిన సీఐడీ.. ఆయనను కూడా అదుపులోకి తీసుకొని విచారణ జరిపేందుకు సిద్ధమవుతున్నది. తమ వ్యక్తిగత ఆస్తులను పెంచుకోవడానికి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌ను మార్చారని సీఐడీ ఆరోపిస్తున్నది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు పిటిషన్ దాఖలు చేశారు. మంగళవారం మధ్యాహ్నం ఈ పిటిషన్ విచారణకు రావాల్సి ఉండగా బుధవారానికి వాయిదా పడింది.
ఏపీ ప్రభుత్వం ప్రతిపక్షాలపై అణచివేతకు పాల్పడుతున్నదని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నేతృత్వంలోని టీడీపీ బృందం మంగళవారం రాష్ట్రపతితో భేటీ అయ్యింది. రాష్ట్రంలో ప్రస్తు తం నెలకొన్న పరిస్థితులు, చంద్రబాబు అరెస్టు, తదనంతర పరిణామాలపై నేతలు వివరించారు. రాష్ట్రపతిని కలిసిన వారిలో ఎంపీలు కేశినేని నాని, గల్లా జయదేవ్, రామ్మోహన్నాయుడు, కనకమేడల ఉన్నారు. ఇదిలా ఉండగా.. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా మాజీ మంత్రి పరిటాల సునీత అనంతపురం శివార్లలోని పాపంపేటలో చేపట్టిన అమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు.