హైదరాబాద్ సిటీబ్యూరో, మే 29 (నమస్తే తెలంగాణ): ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇటీవల అరెస్టయిన సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వర్‌రావును బుధవారం ఏసీబీ కస్టడీలోకి తీసుకున్నది. ఈ నెల 21న ఆయన ఇండ్లతోపాటు బంధువులు, స్నేహితుల ఇండ్లలో ఏసీబీ అధికారులు ఏక కాలంలో సోదాలు నిర్వహించి భారీగా నగదు, నగలు, ఆస్తిపత్రాలను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ
నేపథ్యంలో విచారణ నిమిత్తం ఉమామహేశ్వర్‌రావును మూడో రోజులపాటు ఏసీబీకి అప్పగించాలని నాంపక కోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో బుధవారం మధ్యాహ్నం ఏసీబీ అధికారులు చంచల్‌గూడ జైలు నుంచి ఉమామహేశ్వర్‌రావును కస్టడీలోకి తీసుకున్నారు. సీసీఎస్‌లో సాహితీ ఇన్ఫ్రా కేసుతోపాటు పలు ఇతర కేసుల దర్యాప్తులో అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉమాహేశ్వర్రావు కొందరు పోలీసు అధికారులు, రాజకీయ నాయకులతో కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసినట్లు ఏసీబీ గుర్తించింది. ఆయన లాప్‌టాప్‌లోని వివరాలపై లోతుగా ఆరా తీయనున్నారు.