హైదరాబాద్, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ): నీటిపారుదలశాఖలో పదేండ్లలో భారీగా లంచాలు మేసిన ఓ అవినీతి తిమింగలం గుట్టు ను అవినీతి నిరోధకశాఖ రట్టుచేసింది. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ హేరూర్ నికేశ్‌కుమార్ అక్రమాస్తుల చిట్టాను అవినీతి నిరోధకశాఖ బయటపెట్టింది. నీటిపారుదలశాఖలో ఉద్యోగిగా లంచా లు తీసుకుంటూ నికేశ్ కూడబెట్టిన ఆస్తుల వివరాలపై ప్రకటన విడుదల చేసింది. నికేశ్ ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్టు సమాచారం అందుకున్న ఏసీబీ అధికారులు నికేశ్‌కుమార్ బంధువు లు, బినామీల ఇండ్లు సహా 19 చోట్ల ఏకకాలంలో సోదాలు జరిపారు. 5 ఇండ్ల స్థలాలు, కొల్లూరులో 15ఎకరాల వ్యవసాయభూమి, మొయినాబాద్ లో మూడు ఫామ్‌హౌజ్‌లు, ఖరీదైన మూడు వి ల్లాలు, 6 ప్లాట్లు, 2 వాణిజ్య స్థలాల పత్రాలు స్వా ధీనం చేసుకున్నారు. వీటి మార్కెట్ విలువ రూ. 17,73,53,500 ఉంటుందని, బహిరంగ మా ర్కెట్లో రూ.190 కోట్ల వరకు ఉంటుందని అంచ నా వేస్తున్నారు. అధికారులు మరో 9చోట్ల సోదా లు నిర్వహించేందుకు సిద్ధమైనట్టు తెలుస్తున్నది.
తీగలాగితే కదిలిన డొంక
హేరూర్ నికేశ్‌కుమార్ 2013 నుంచి నీటిపారుదలశాఖలో ఉద్యోగం చేస్తున్నాడు. భారీగా లంచాలు తీసుకుంటూ ఆస్తులు కూడబెట్టాడు. మణికొండ నెక్నాన్పూర్లో భవన నిర్మాణానికి, ఇరిగేషన్ అనుమతుల కోసం బాధితుడు ఉపేంద్రనాథ్‌రెడ్డి దరకాస్తు చేసుకున్నాడు. ఎన్వోసీ ఇవ్వడానికి ఇరిగేషన్ ఎగ్టిక్యూటివ్ ఇంజినీర్ భన్సీలాల్, అసిస్టెంట్ ఇంజినీర్ కార్తీక్, సెక్షన్ ఏఈ నికేశ్‌కుమార్ రూ.2.5 లక్షల లంచం డిమాండ్ చేశారు. రూ.1.5 లక్షలు ముందుగానే తీసుకున్నారు. మిగతా డబ్బు కోసం ఈ ముగ్గురు వేధిస్తుండటంతో ఉపేంద్రనాథ్‌రెడ్డి ఏసీబీని ఆశ్రయించాడు. ఈ ఏడాది మే 30న రంగారెడ్డి జిల్లా రెడ్‌హిల్స్‌లోని నీటిపారుదలశాఖ కార్యాలయంలో ఈ ముగ్గురికి బాధితుడు మరో రూ.లక్ష ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కేసును లోతుగా దర్యాప్తు చేయగా నికేశ్‌కుమార్ అక్రమాస్తులు బయటపడ్డాయి.
పెద్దలతో లింకులు?
నికేశ్ లంచాలను నగదు కంటే ఎక్కువగా స్థిరాస్తుల రూపంలోనే తీసుకునేవాడని, ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారులతోనూ సత్సంబంధాలు ఉన్నట్టు తెలుస్తున్నది. అలాగే ఎస్బీఐ ఖాతాలో భారీగా లావాదేవీలు జరిగినట్టు గుర్తించిన అధికారులు ఆ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరి ఖాతాలోకి వెళ్లాయి? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. లక్ష రూపాయల లంచం కేసులో పట్టుబడిన నికేశ్ చిట్టా 190 కోట్లకు చేరింది. ఇంకా సోదాలు జరగనున్నాయని భారీగా అక్రమాలు బయటపడే అవకాశం ఉందని ఏసీబీ వర్గాలు చెబుతున్నాయి.