హైదరాబాద్, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఇటీవల తాము ఏసీబీ అధికారులమంటూ లంచాధికారులను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో అప్రమత్తమైన ఏసీబీ డీజీ విజయ్‌కుమార్ స్పందించి ఆదివారం ప్రకటన విడుదల చేశారు. కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు ఏసీబీ అధికారుల పేరుతో నకిలీ కాల్స్ చేస్తూ.. ప్రభుత్వ ఉద్యోగులపై కేసులు నమోదు చేయకుండా డబ్బులు డిమాండ్ చేస్తూ.. బెదిరిస్తున్న ఘటనలు తమ దృష్టికి వచ్చాయని పేర్కొన్నారు. ఎవరైనా ఏసీబీ అధికారుల పేరుతో ప్రభుత్వ అధికారులకు, సామాన్యులకు కాల్ చేస్తే తక్షణం ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064కు కాల్ చేయలని కోరారు. లేదంటే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. ఎవరైనా అధికారులు లంచాల కోసం పీడిస్తుంటే 1064కు కాల్ చేయాలని, లేదా తమ వాట్సాప్ నంబర్ 9440446106కు, ఫేస్బుక్లో Telangana ACB, ఎక్స్‌లో @TelanganaACBలో కూడా ఫిర్యాదు చేయొచ్చని, బాధితుల పేరు, వివరాలు గోప్యంగా ఉంటాయని విజయ్‌కుమార్ భరోసా కల్పించారు.