హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ): ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడిని కస్టడీకి ఇవ్వాలన్న సీఐడీ పిటిషన్‌పై తీర్పు మరోమారు వాయిదా పడింది. బుధవారమే ఈ కేసులో వాదనలు పూర్తికాగా తీర్పు గురువారానికి వాయిదా పడింది. చంద్రబాబు క్వాష్ పిటిషన్ హైకోర్టులో ఉండడంతో తీర్పును శుక్రవారం ఉదయం 10.30 గంటలకు వాయిదా వేస్తున్నట్టు విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి తెలిపారు. క్వాష్ పిటిషన్ శుక్రవారం హైకోర్టులో లిస్ట్ అయితే తీర్పు వాయిదా వేస్తామని, కాకుంటే తీర్పు వెలువరిస్తామని న్యాయమూర్తి తెలిపారు. అమరావతి రింగురోడ్డు, ఫైబర్ నెట్ కేసుల్లో సీఐడీ వేసిన పీటీ వారెంట్లపై నేడు విచారణ చేపట్టనున్నట్టు కోర్టు పేర్కొంది. మరోవైపు, స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంపై పూర్తిస్థాయి దర్యాప్తు జరపాలని కోరుతూ రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ 44 మందిని ప్రతివాదులుగా చేరుస్తూ రిట్ పిట్‌షన్ దాఖలు చేశారు.
ఏపీ అసెంబ్లీలో గందరగోళం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో గురువారం తొలిరోజే గందరగోళం చోటుచేసుకుంది. చంద్రబాబు అరెస్ట్‌పై చర్చించాలంటూ శాసనసభ, మండలిలో టీడీపీ నేతలు పట్టుబట్టడంతో ఉభయ సభలను కాసేపు వాయిదా వేశారు. విరామం తర్వాత సభలు ప్రారంభమైనా పరిస్థితిలో మార్పు రాలేదు. స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టిన 14 మంది టీడీపీ సభ్యులను స్పీకర్ తమ్మినేని సీతారాం ఒక రోజు సస్పెండ్ చేశారు. కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్‌ను సెషన్ మొత్తం సస్పెండ్ చేశారు.