కొల్లాపూర్, నవంబర్ 2 : ప్రధానోపాధ్యాయురాలి నుంచి లంచం తీసుకున్న ఎమ్మార్సీతోపాటు ఎంఈవోను ఏసీబీ అధికారులకు పట్టుకున్నారు. ఈ ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో బుధవారం చోటుచేసుకున్నది. ఏసీబీ డీఎస్పీ కృష్ణగౌడ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. కొల్లాపూర్‌కు చెందిన రిటైర్డ్ సబ్‌పోస్ట్‌మాస్టర్ పుట్టపాగ సిద్ధన్న, ఉమాదేవి దంపతులు. ఉమాదేవి స్థానిక ప్రాథమిక పాఠశాలలో హెచ్ఎంగా పనిచేస్తున్నారు.
ఆమె రాష్ట్ర ప్రభుత్వ జీవిత బీమా సంస్థలో మూడు పాలసీలు చేయగా, వాటి గడువు గత ఆగస్టు ఒకటిన ముగిసింది. వీటికి సంబంధించిన జిరాక్స్ ప్రతులను ఎమ్మార్సీ చంద్రశేఖర్‌కు అందజేశారు. సంబంధిత పత్రాలు కావాలంటే ఎంఈవో చంద్రశేఖర్‌రెడ్డికి రూ.30 వేలు, తనకు రూ.5 వేలు ఇవ్వాలని ఆయ న డిమాండ్ చేశాడు. ఆ మేరకు సిద్ధన్న బుధవారం మధ్యాహ్నం స్కూల్ వద్దకు వెళ్లి ఎంఈవో, ఎమ్మార్సీలకు సంబంధించి రూ.35 వేలను చంద్రశేఖర్‌కు అందించి బయటకు రాగానే.. ఏసీబీ అధికారులు చంద్రశేఖర్‌ను పట్టుకున్నారు. నాగర్‌కర్నూల్‌లో ఉన్న ఎంఈవో చంద్రశేఖర్‌రెడ్డిని నల్లగొండ ఏసీబీ సీఐ, అధికారులు అదుపులోకి తీసుకున్నారు.