పటాన్చెరు, ఏప్రిల్ 4: సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల నీటి పారుదలశాఖ ఏఈ రవికిశోర్ శుక్రవారం రూ. లక్ష లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడినట్టు ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. గుమ్మడిదల మండల కేంద్రానికి సమీపంలోని ఓ వ్యక్తి తన 4,400 గజాల స్థలంలో కాంపౌండ్‌వాల్ కట్టి, అక్కడున్న నాలాను సిమెంట్‌తో అధునీకరించాడు. విషయం తెలుసుకున్న గుమ్మడిదల ఇరిగేషన్ ఏఈ రవికిశోర్ సదరు భూమి వద్దకు వచ్చి ఇరిగేషన్ శాఖ నుంచి నాలాకు ఎన్వోసీ తీసుకోవాలని, లేదంటే కట్టడాలను హైడ్రాతో కూల్చివేయాల్సి ఉంటుందని యజమానికి హెచ్చరించారు. స్థల యజమాని ఆందోళన చెందగా రూ. 10 లక్షలు ఇస్తే ఎన్వోసీ ఇప్పిస్తానని చెప్పి 7లక్షలకు బేరం కుదుర్చుకున్నాడు. లంచంలో తొలివిడత రూ.లక్షను పటాన్‌చెరులోని ఇరిగేషన్‌శాఖ కార్యాలయం వద్దకు తీసుకుని రావాలని సూచించాడు. బాధితుడికి డబ్బులు తీసుకుని రాగా తన కారులో పెట్టాలని ఫోన్లో సూచించాడు. అనంతరం రవికిశోర్ కారువద్దకు వెళ్లి డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుడిని నాంపల్లి కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ చెప్పారు.
లంచం అడిగితే కాల్ చేయండి: ఏసీబీ డీఎస్పీ
ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా లంచంగా అడిగితే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064కి ఫిర్యాదు చేయాలని ఏసీబీ డీఎస్పీ కోరారు. ఏసీబీ తెలంగాణ సోషల్ మీడియా వాట్సప్ నంబర్ 94404 46106 కి కూడా ఫిర్యాదు చేయవచ్చని సూచించారు.