నల్లగొండ, సెప్టెంబర్ 4: మత్స్యకారులకు సభ్యత్వం ఇచ్చేందుకు రూ.20 వేలు లంచం తీసుకుంటూ జిల్లా మత్స్యశాఖ అధికారి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. డీఎస్పీ శరత్చంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా కేతెపల్లి మండలం బొప్పారం గ్రామ చెరువు మత్స్యసహకార సొసైటీలో కొత్తగా 17 మందికి సభ్యత్వం ఇచ్చేందుకు జిల్లా మత్స్యశాఖ అధికారి చరితారెడ్డి రూ.70 వేలు లంచం డిమాండ్ చేసింది.
చివరికి సొసైటీ బాధ్యుడు శ్రీనివాస్ ద్వారా రూ.50 వేలకు ఒప్పందం కుదిరింది. ఈ క్రమంలో గురువారం కలెక్టరేట్లోని తన కార్యాలయంలో రూ.20 వేలు లంచం తీసుకుంటూ చరితారెడ్డి ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఆమె కార్యాలయంతోపాటు హైదరాబాద్ వనస్థలిపురంలోని ఆమె ఇంట్లోనూ ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ మేరకు కేసు నమోదుచేసి ఆమెను అదుపులోకి తీసుకున్నట్టు ఏసీబీ డీఎస్పీ శరత్చంద్ర తెలిపారు.