బిచ్కుంద, ఏప్రిల్17 : కల్లు దుకాణం తరలింపునకు అనుమతి ఇవ్వడానికి రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ కామారెడ్డి జిల్లా బిచ్కుంద ఎక్సైజ్ సీఐ సత్యనారాయణ శుక్రవారం ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికి పోయారు. ఏసీబీ డీఎస్పీ శేఖర్ తెలిపిన ప్రకారం.. మద్నూర్ మండలంలో కల్లు దుకాణం నిర్వహించే వ్యక్తి.. తన దుకాణాన్ని మరో గ్రామానికి తరలించడానికి, కేసులు నమోదు చేయకుండా ఉండడానికి ఎక్సైజ్ సీఐ సత్యనారాయణను కలిశారు. ఇందుకు గాను రూ.3 లక్షలు లంచం ఇవ్వాలని ఆయన కోరగా, రూ.2 లక్షలకు ఒప్పందం కుదిరింది.
శుక్రవారం బిచ్కుందలోని అద్దె ఇంట్లో బాధితుడి నుంచి రూ.2 లక్షలు తీసుకుంటుండగా, ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం ఇంట్లో సోదాలు నిర్వహించగా, లెక్కల్లో లేని రూ.45 వేల నగదు లభ్యమైంది. అదే సమయంలో హైదరాబాద్‌లోని షాద్‌నగర్‌లో గల సీఐ సత్యనారాయణ ఇంట్లో సోదాలు నిర్వహించగా, రూ.12 లక్షలు లభ్యమయ్యాయి. నిందితుడిపై కేసు నమోదు చేసి, నాంపల్లి కోర్టులో హాజరు పర్చనున్నట్లు ఏసీబీ డీఎస్పీ తెలిపారు.