హైదరాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఉన్నతాధికారుల దుర్భాషలు, అవమానకరమైన ప్రవర్తన కిందిస్థాయి అధికారులను హడలెత్తిస్తున్నాయి. యూజ్లెస్ ఫెలో, మైండ్లేదా, రాస్కెల్, ఇడియట్, గాడిదలు కాస్తున్నారా? కథలు చెప్పండి వింటా.. వంటి తిట్లదండకంతో పలువురు ఐఏఎస్ అధికారులు సబార్డినేట్లను మానసికంగా వేధిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల సచివాలయంలో ఐటీ, ఇండస్ట్రీ సెక్రటరీ బూతులతో ఒక అధికారిని అవమానపరచడంతో ఆయనకు గుండెపోటు వచ్చిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఇలాంటి ఘటనలు పెరిగిపోతుండటంతో బాధితులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. కొందరు దవాఖానల పాలవుతుంటే, మరికొందరు వీఆర్ఎస్కు సిద్ధమవుతున్నారు. మరికొందరు అవమానాలు తట్టకోలేక ఉద్యోగానికి రాజీనామా చేసేందుకు కూడా వెనుకాడటం లేదు. ఈ నేపథ్యంలో తెలంగాణ సచివాలయ అధికారుల సంఘం (టీజీఎస్వోఏ) ప్రతినిధులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు ఇటీవల వినతి పత్రం సమర్పించారు. వేధింపులు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
అధికారుల్లో భయాందోళనలు
వివిధ శాఖల్లో ఉన్నతాధికారులు కిందస్థాయి సిబ్బందిని వేధించడం కొత్తేమీ కాదు. కానీ, కాంగ్రెస్ పాలనలో ఈ తరహా ఘటనలు మరింత తీవ్రమయ్యాయి. తాజాగా సచివాలయంలో ఐటీ, ఇండస్ట్రీ విభాగంలోని కీలక అధికారిని దూషించడంతో ఆయన తీవ్ర మానసిక ఒత్తిడికి గురై గుండెపోటు బారినపడ్డారు. ఆయనను వెంటనే సచివాలయంలోని డిస్పెన్సరీకి తరలించారు. కాస్త కుదుటపడ్డాక ఇంటికి తరలించారు. ఈ ఘటన సచివాలయంలోని ఇతర అధికారుల్లో భయాందోళనలు రేపింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని శాఖల్లోనూ ఇలాంటి దుర్భాషలు సర్వసాధారణమయ్యాయి. అధికారులు వ్యక్తిగత దూషణలకు దిగుతుండటంతో మధ్యస్థాయి అధికారుల కెరీర్, పనితీరుపై ప్రభావం చూపుతున్నది. ఈ మధ్యస్థాయి అధికారులు తమ కోపాన్ని కిందిస్థాయి సిబ్బంది మీద చూపుతున్నారు. తప్పుచేస్తే, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే బాధ్యులైన వారిని హెచ్చరిస్తే తప్పులేదు కానీ, కొందరు అకారణంగా దూషిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఆహ్లాదకర వాతావరణాన్ని చెడగొడుతున్నారని వాపోతున్నారు. ఉన్నతాధికారులు తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని బాధిత అధికారి ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రతి హెచ్‌వోడీ తిట్ల దండకమే
సచివాలయ స్థాయిలో ఉన్నతాధికారులే కాదు, కమిషనర్లు, సెక్షన్ ఆఫీసర్లు, డైరెక్టర్లు, అన్ని విభాగాల్లోని అధిపతులు కూడా కిందిస్థాయి ఉద్యోగులపై తిట్ల దండకం అందుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. కొందరు బయటకు చెప్తుండగా, మరికొందరు అధికారులు బయటకు చెప్పుకోలేక మథనపడుతున్నారు. చిన్నచిన్న అంశాలకు కూడా కోప్పడుతూ దూషిస్తున్నారని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ అధికారి తెలిపారు. ఎక్కడైనా, ఎప్పుడైనా పొరపాటు లేదా విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే మెమోలు ఇచ్చి చట్టపరంగా చర్యలు తీసుకోవాలి గాని వ్యక్తిగతంగా దూషిస్తుండటంతో మానసికంగా కుంగిపోతున్నట్టు వాపోయారు. గతంలో ఇలాంటి ఘటనలు పోలీస్‌శాఖలో ఎక్కువగా వెలుగులోకి వచ్చేవి.
ఇప్పుడు అన్నిశాఖల్లో తిట్ల పురాణం సర్వసాధారణంగా మారిందని ఉద్యోగులు చెప్తున్నారు. ఉన్నతాధికారుల దుర్భాషలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఫిర్యాదు చేసేందుకు ఉద్యోగ సంఘాల నేతలు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. గతంలో కొన్ని శాఖలకే పరిమితమైన ఇలాంటి చెడు ధోరణులు ఇప్పుడు అన్ని శాఖలకు వ్యాపించాయని, ఇలాంటి వాటిని మొదట్లోనే నివారించాలని, సంబంధిత అధికారులపై చట్టపరంగా చర్యలు చేపట్టాలని సీఎంకు ఫిర్యాదు చేయాలని ఆయా సంఘాల నేతలు చూస్తున్నట్టు సమాచారం. ప్రభుత్వ శాఖల్లో ఇలాంటి దుర్భాషలు, వేధింపులు పెరిగిపోతుండటం పాలనా వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుందని, మొత్తం వ్యవస్థలో అసంతృప్తి పెరుగుతుందని, ప్రభుత్వం ఈ సమస్యలపై తక్షణ చర్యలు తీసుకోకపోతే, మరిన్ని ఘటనలు జరిగే అవకాశం ఉన్నదని సీఎంకు నివేదించేందుకు నేతలు రెడీ అవుతున్నారు.
ఏం చేస్తున్నరు.. గాడిదలు కాస్తున్నరా?
గ్రామీణ పరిపాలనా వ్యవహారాలు చూసే ఓ మహిళా అధికారి సమీక్షలు, వీడియో కాన్ఫరెన్స్(వీసీ)ల సందర్భంగా అందరిముందే తిట్ల దండకం అందుకుంటారని జిల్లాస్థాయి అధికారులు వాపోతున్నారు. ‘ఆ పని ఎందుకు కాలేదు, ఈ పని ఎందుకు కాలేదు. గాడిదలు కాస్తున్నారా?’ అని అంటారని చెప్తున్నారు. వీసీ సందర్భంగా 33 జిల్లాల అధికారుల ముందు కొందరిని వ్యక్తిగతంగా దూషిస్తుండటంతో మానసికంగా కుంగిపోతున్నామని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. నిధులు లేకపోయినా పనులు చేస్తున్నా, అందరి ముందు ఇలా తూలనాడటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇదే అధికారిణి మహిళా అంశాలపై సమీక్షిస్తూ ‘ఈ రోజు ఏం కథలు రెడీ చేసుకున్నారు, చెప్పండమ్మా.. చెప్పండి.. వింటాను’ అని వెటకారం ఆడతారని వాపోయారు. చిన్నంతరం పెద్దంతరం లేకుండా మాటలు అంటారని ఆవేదన వ్యక్తంచేశారు. కొందరు జిల్లా స్థాయి అధికారులు ఆ శాఖ మంత్రి దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లినట్టు తెలిసింది. మరికొందరు సమష్టిగా ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం.
కొన్ని ఉదాహరణలు ఇవిగో..