హైదరాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో 26వేల పైచిలుకు బడుల్లో మధ్యాహ్న భోజనం వండుతుండగా, సుమారు 76% బడుల్లో కట్టలపొయ్యి పైనే వంటలు చేస్తున్నారు. కేవలం 24% బడుల్లోనే ఎల్పీజీ కనెక్షన్లు ఉన్నాయి. అన్ని బడుల్లో వంటలను ఎల్పీజీకి మార్చాలని జూలైలో విద్యాశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. ఐదు నెలలవుతున్నా కేవలం 410 బడులకు మాత్రమే అదనంగా ఎల్పీజీ కనెక్షన్లు ఇచ్చారు. ఫలితంగా మధ్యాహ్న భోజన కార్మికులు తీవ్ర అవస్థలు పడుతుండగా, వంటల్లో కూడా నాణ్యత లోపిస్తున్నది. రాష్ట్రంలో 26 వేల పైచిలుకు బడుల్లో మధ్యాహ్న భోజన పథకం అందిస్తున్నారు. ఆయా బడుల్లో 17,91,035 మంది విద్యార్థులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. వాటిలో తొలుత 5,805 బడుల్లో జూలై నాటికి ఎల్పీజీ కనెక్షన్లు ఉండగా, అదనంగా 410 బడులకు కనెక్షన్లు ఇచ్చారు. దీంతో ఎల్పీజీ కనెక్షన్లు ఉన్న బడుల సంఖ్య 6,215కి చేరుకున్నది. మరో 19,786 బడుల్లో మధ్యాహ్న భోజనాన్ని కట్టెల పొయ్యిలపైనే వండుతున్నారు. ఆరుబయటే వండటం, కిచెన్ షెడ్లు లేక, సురక్షిత తాగునీరు అందక, నాసిరకం ఆహార పదార్థాలను వినియోగించడంతో పలు బడుల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు వెలుగుచూశాయి. నారాయణపేట జిల్లా మాగనూరులో వరుసగా మూడుసార్లు ఒకే బడిలో ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటుచేసుకోవడం కలకలం రేపింది. ఈ నేపథ్యంలోనే బడులన్నింటినీ ఎల్పీజీకి మార్చాలన్న విద్యాశాఖ ఆదేశాలు ఇప్పటికీ పూర్తిస్థాయిలో అమలుకు నోచలేదు.
విద్యా కమిషన్ సిఫారసు చేసినా..
మధ్యాహ్న భోజనాన్ని కట్టెల పొయ్యిలపై వండొద్దని, గ్యాస్ స్టవ్లపైనే వంట చేయాలని.. ఇందుకు ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేయాలని తెలంగాణ విద్యా కమిషన్ సిఫారసు చేసింది. హాస్టళ్లు, గురుకులాల్లోనూ గ్యాస్ స్టవ్లపైనే వండాలని సర్కారుకు సూచించింది. వంట సహా విద్యార్థులు తాగేందుకు బోర్ నీటిని వాడొద్దని, మిషన్ భగీరథ నల్లా నీటిని వినియోగించాలని సూచించింది. ప్రభుత్వ విద్యాసంస్థలు, గురుకులాలు, హాస్టళ్లలన్నింటికీ ఒకే విధమైన కామన్ మెనూను అమలు చేయాలని ఈ కమిషన్ ప్రతిపాదించింది. మెస్చార్జీలను అన్ని క్యాటగిరీల వారికి రెండు రూపాయలు అదనంగా పెంచాలని సూచించింది. అంగన్వాడీలు, గురుకులాలు, హాస్టళ్లు, కేజీబీవీలు, మాడల్ స్కూళ్లు, జిల్లా పరిషత్ పాఠశాలలన్నీ వ్యత్యాసం లేకుండా అన్నింటికీ ఒకే తరహాలో ఒకే మెస్చార్జీలను అమలు చేయాలని సిఫారసు చేసింది. 50 పేజీల నివేదికను జనవరిలో ప్రభుత్వానికి సమర్పించింది. కానీ ఆ నివేదికను సర్కారు అటకెక్కించింది. సిఫారసులను కనీసం లెక్కలోకి తీసుకున్నట్టు కూడా కనిపించడంలేదు.