హైదరాబాద్, ఆగస్టు17 (నమస్తే తెలంగాణ): వైద్యారోగ్య శాఖలో ఇన్చార్జుల పాలన వ్యవస్థను ప్రభుత్వం రద్దు చేసింది. 3 హెచ్‌వోడీ పోస్టులను మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీచేశారు. రాష్ట్ర ఏర్పాటు తరువాత వైద్యారోగ్యశాఖలో డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, వైద్య విధాన పరిషత్ కమిషనర్, డ్రగ్ కంట్రోల్ డైరెక్టర్ పోస్టులను మంజూరు చేయలేదు. ఇన్చార్జి అధికారులను కొనసాగిస్తూ వచ్చారు.
బీజేపీ రాష్ట్ర ఇన్చార్జిగా అభయ్‌పాటిల్!
హైదరాబాద్, ఆగస్టు17(నమస్తే తెలంగాణ): బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జిగా అభయ్ పాటిల్ వైపే బీజేపీ అధిష్టానం మొగ్గుచూపుతున్నట్టు సమాచారం. రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జిగా తరుణ్ చుగ్ కొనసాగారు. అయితే పార్లమెంట్ ఎన్నికలకు తెలంగాణ ఇన్చార్జిగా అభయ్‌పాటిల్‌ను నియమించింది. ఆయన సారథ్యంలో బీజేపీ 8ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంది. దీంతో తరుణ్ చుగ్ స్థానంలో అభయ్ కుమార్ పాటిల్‌నే బీజేపీ ఇన్చార్జిగా కొనసాగించాలని నిర్ణయించినట్టు తెలిసింది.
ఆర్టీసీ హామీలు అమలుచేయాలి
హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): ఎన్నికల సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలతోపాటు దీర్ఘకాలిక పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని ఆర్టీసీ జేఏసీ నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జేఏసీ నేతలు 31 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని శనివారం డిప్యూటీ సీఎం భట్టి, రవాణాశాఖ మంత్రి పొన్నం, లేబర్ కమిషనర్‌కు అందజేశారు. ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం, సంస్థలో ట్రేడ్ యూనియన్ల పునరుద్ధరణ, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతభత్యాల అమలు, వేతన సవరణ వంటి డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు. ఆ 31 డిమాండ్లలో 6 డిమాండ్లను వారంలోగా అమలు చేస్తామని హామీ ఇచ్చారని నాయకులు తెలిపారు. కార్యక్రమంలో ఆర్టీసీ జేఏసీ చైర్మన్ వెంకన్న, వైస్ చైర్మన్ థామస్‌రెడ్డి, కన్వీనర్ మౌలానా, కో కన్వీనర్లు యాదయ్య, సురేశ్, యాదగిరి పాల్గొన్నారు.