హయత్‌నగర్, ఫిబ్రవరి 2 : నల్లగొండ-రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార లిమిటెడ్, మదర్ డెయిరీ సంస్థ పాలకవర్గం రద్దును కోరుతూ ప్రత్యేక సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటుచేయాలని నార్మాక్ యూనియన్ సొసైటీ చైర్మన్లు డిమాండ్‌చేశారు. ఈ మేరకు సోమవారం హయత్‌నగర్‌లోని మదర్ డెయిరీ సంస్థ ప్రధాన కార్యాలయంలో మాజీ చైర్మన్ గుత్తా జితేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో సంస్థ ఎండీ గఫార్‌కు సొసైటీ చైర్మన్లు నోటీసు అందజేశారు. ఈ సందర్భంగా గుత్తా జితేందర్‌రెడ్డి, సొసైటీ చైర్మన్లు మాట్లాడుతూ.. నార్మాక్ యూనియన్ సభ్యసంఘాల నుంచి పాలకవర్గం సేకరించిన పాలకు గత 4 నెలలుగా బిల్లులు చెల్లించడం లేదని ఆరోపించారు.
దీంతో పాడి రైతులు ఆర్థికంగా దెబ్బతిని పూర్తిగా నిర్వీర్యమయ్యే పరిస్థితి దాపురించిందని పేర్కొన్నారు. సంస్థలో పనిచేసే ఉద్యోగులకు కూడా సక్రమంగా వేతనాలు చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. వీటన్నింటికీ ప్రధాన కారణం పాలకవర్గం సమయానుకూల నిర్ణయాలు తీసుకోకపోవడమేనని, పాలకవర్గం అవినీతి, అక్రమాలు పెరిగిపోవడం వల్లే సంస్థ నష్టాల్లోకి నెట్టివేయబడిందని, మరోపక్క బ్యాంకు రుణాలు చెల్లించలేక సంస్థ మనుగడే ప్రశ్నార్థకంగా మారిందని పేర్కొన్నారు. పాలకవర్గాన్ని తొలగించాలని సభ్యులమంతా నిర్ణయించామని, యూనియన్ బైలా సెక్షన్-19 ప్రకారం ఇదే ఎజెండా అంశంగా ప్రత్యేక సర్వసభ్య సమావేశం ఏర్పాటుచేయాలని నోటీసు అందజేస్తున్నట్టు వెల్లడించారు. 311 మంది అర్హులైన సభ్యసంఘాలకుగానూ 234 మంది సంతకాలతో 55 ప్రతులతో కూడిన వినతిపత్రాన్ని అందజేస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో సభ్యసంఘాల అధ్యక్షులు ఒగ్గు భిక్షపతి, వెంకట్‌రెడ్డి, రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
గందరగోళంగా మదర్ డెయిరీ
గత మూడు నెలలుగా పెండింగ్ ఉన్న వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగులు మదర్ డెయిరీ ప్రధాన కార్యాలయం ఎదుట బైఠాయించి ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. సంస్థ చైర్మన్ మధుసూదన్‌రెడ్డి చాంబర్లో లేకపోవడంతో ఉద్యోగులు ఖాళీ కుర్చీకి వినతిపత్రం అందజేసి నిరసన తెలిపారు. ఒకవైపు పాలకవర్గం రద్దు డిమాండ్, మరోవైపు సంస్థ ఉద్యోగులు నిరసనలతో సంస్థ ఆవరణంతా గందగోళంగా మారింది.