ఖైరతాబాద్, జనవరి 21: మచ్చలేని నేత, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కపై నైని బొగ్గు టెండర్ల విషయంలో ఏబీఎన్ చానల్, ఆంధ్రజ్యోతి పత్రికలో పచ్చి అబద్ధాలతో కూడిన కథనాలు వండి వార్చారని, భట్టిపై ఆ మీడియా సంస్థ బురదజల్లే ప్రయత్నం చేసిందని సింగరేణి ఎస్సీ, ఎస్టీ ఉద్యోగ సంఘాలు ధ్వజమెత్తాయి. ఆ కథనాలు పత్రికా వ్యవస్థ దుర్వినియోగానికి పరాకాష్ట అని మండిపడ్డాయి. తప్పుడు కథనాలు ఇచ్చిన ఏబీఎన్ రాధాకృష్ణపై తక్షణమే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి,ఆయనను అరెస్టు చేయాలని ఆ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో దేశవ్యాప్తంగా దళిత సంఘాలన్నీ జేఏసీగా ఏర్పడి కార్యాచరణను ప్రకటిస్తామని స్పష్టంచేశారు. త్వరలోనే ఏబీఎన్ రాధాకృష్ణపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు వేస్తామని హెచ్చరించారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో పలువురు నేతలు మాట్లాడారు. దళితరత్న అవార్డు గ్రహీత జేబీ రాజు మాట్లాడుతూ ఏబీఎన్‌లో వచ్చిన కథనం తమను తీవ్రంగా కలచివేసిందని, ఇది కోటిన్నర మంది దళితులను అవమానించడమేనని ధ్వజమెత్తారు.
భట్టి దళితుడు కాబట్టే ఇలాంటి దిగజారుడు కథనాలు అల్లారని అభిప్రాయపడ్డారు. ఇది పత్రికా వ్యవస్థను దుర్వినియోగం చేయడమేనని విమర్శించారు. ఏబీఎన్ చానల్, ఆంధ్రజ్యోతి పత్రికలో నైని బొగ్గు బ్లాక్ టెండర్ల బ్లాకులపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్గ అక్రమాలకు పాల్పడ్డారంటూ అసత్య కథనాలు వచ్చాయని సింగరేణి, ఎస్సీ, ఎస్టీ జేఏసీ చైర్మన్, సింగరేణి ఎస్సీ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గోళ్ల రమేశ్ ఆరోపించారు. సింగరేణి సంస్థ గతంలో సీఎం వద్దే ఉండేదని, ఈసారి ఉప ముఖ్యమంత్రి ఆధీనంలోకి వెళ్లిందనడం మరో అబద్ధపు కథనాన్ని వదిలారని తెలిపారు. సింగరేణి సంస్థ విద్యుత్తు శాఖ మంత్రి పరిధిలోనే ఉంటుందని, సీఎం వద్ద ఏ రకమైన అజమాయిషీలో ఉండదని తేల్చి చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆధీనంలో సంస్థ ఉండేదని, ఇప్పుడు భట్టి వద్ద ఉందని తెలిపారు. పాలసీ రూపకల్పన, రాష్ట్ర ప్రయోజనాల విషయంలోనే సీఎం నిర్ణయం తీసుకోవచ్చని, ఈ విషయం ఆ మీడి యా సంస్థకు తెలియదా? అని ప్రశ్నించారు.
టెండర్ దాఖలుకు ఇంకా గడువుంది!
ఫీల్డ్ విజిట్ సర్టిఫికెట్ అనేది ఒక్కరికే ఇచ్చారని, మిగతా వారికి ఇవ్వలేదనడం వాస్తవ విరుద్ధమని గోళ్ల రమేశ్ పేర్కొన్నారు. ఫీల్డ్ విజిట్ సర్టిఫికెట్ తప్పనిసరి అని, టెండరు బిడ్ సమర్పించడానికి 29వ తేదీ వరకు గడువు ఉన్నదని గుర్తుచేశారు. ఫీల్డ్ విజిట్ చేయగానే సర్టిఫికెట్ ఇవ్వరని, పాలనా సౌకర్యాలను దృష్టిలో పెట్టుకొని అన్నీ సరిగ్గా ఉంటేనే ఇస్తారని తేల్చిచెప్పారు. టెండర్ల ముందుకు ప్రీ బిడ్ మీటింగ్ పెడతారని, టెండర్లలో నిబంధనలపై అభ్యంతరాలపై చర్చిస్తారని తెలిపారు. ఆ ప్రీ బిడ్ మీటింగ్‌లో 16 మంది కాంట్రాక్టర్లు పాల్గొన్నారని, అలాంటి క్రమంలో భట్టిపై చేసినవన్నీ అబద్ధపు కథనాలేనని తేలిందని చెప్పారు.
భట్టిపై ఆరోపణలు తగదు!
సమాజంలో ఉన్న అసమానతలు, సమస్యలను వదిలి.. నికార్సైన రాజకీయ నేత భట్టిపై ఆరోపణలు చేయడం తగదని నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎస్సీ, ఎస్టీ ఆర్గనైజేషన్స్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆరేపల్లి రాజేందర్ హితవు పలికారు. ఏబీఎన్‌లో వచ్చిన కథనాలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని పీపుల్స్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ అ ధ్యక్షుడు డాక్టర్ చొప్పర బాలకృష్ణ పేర్కొన్నారు. దళిత సామాజికవర్గం నుంచి డిప్యూటీ సీఎం స్థాయికి ఎదిగిన భట్టి విక్రమార్కపై మీడియా రూపంలో బురదజల్లడం బాధాకరమని ఆలిండియా ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ జాతీ య అధ్యక్షుడు పీవీ రమణ పేర్కొన్నారు. గతంలో ఆయన వైఎస్సార్‌తో సఖ్యతగా ఉన్నారన్న కోపంతోనే ఇలా చేశారా? దళిత వ్యక్తిని ఏమన్నా పట్టించుకోరన్న భావంతో చేశారా? అని ప్రశ్నించారు. ఏబీఎన్ రాధాకృష్ణ భవిష్యత్తులో ఇలాంటివి చేస్తే చూస్తూ ఊరుకోబోమని తెలిపారు. సమావేశంలో ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూక్యా కృష్ణమూర్తి, మాణిక్ రాం పాల్గొన్నారు.
భట్టి ప్రత్యేక చొరవ
భవిష్యత్తులో బొగ్గు భవిష్యత్తు అంధకారమవుతుందని, సంప్రదయ విద్యుత్తు పెరుగుతుందని, థర్మల్, సోలార్ ఎనర్జీ వృద్ధి చెందుతాయని గోళ్ల రమేశ్ తెలిపారు. 42 వేల మంది పర్మనెంట్, 30వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు సంస్థలో పనిచేస్తున్నారని, వారి భవిష్యత్తు అంధకారమవుతుందని గ్రహించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బొగ్గుకు డిమాండ్ తగ్గిపోయిన తరుణంలో నైని కోల్ బ్లాక్ టెండర్ కోసం ఒడిషాకు రెండుసార్లు వెళ్లి అక్కడి సీఎంతో చర్చించి మార్గం సుగమం చేశారని తెలిపారు. 1,600 మెగావాట్ల విద్యుత్తు కోసం ఎంవోయూ చేసుకొని వచ్చారని తెలిపారు.