హైదరాబాద్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): ఆసరా వృద్ధాప్య పింఛన్లకు అర్హులైనవారు ఈ నెల 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. మీ-సేవా, ఈ-సేవా కేంద్రాల్లో ఉచితంగా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. సీఎం కేసీఆర్ ఎన్నికల హామీ మేరకు వృద్ధాప్య పింఛన్ల అర్హత వయస్సును 65 నుంచి 57 ఏండ్లకు తగ్గించిన నేపథ్యంలో శనివారం సెర్ప్ సీఈవో సందీప్‌కుమార్ సుల్తానియా మార్గదర్శకాలు జారీచేశారు. ఓటరుకార్డు, మున్సిపల్ అధికారులు జారీచేసిన జనన ధ్రువీకరణపత్రం, విద్యాసంస్థ లు జారీచేసిన టీసీ, మెమోల్లో పేర్కొన్న పుట్టినరోజు ఆధారంగా అర్హత వయస్సును నిర్ధారిస్తారు.
దరఖాస్తుకు ఏమేం కావాలంటే..
ఆసరా పింఛన్ దరఖాస్తుదారులు ఫొటోతోపాటు, ఆధార్‌కార్డు, వయస్సు నిర్ధారణపత్రం జిరాక్స్ కాపీలను ఈ-సేవా, మీ-సేవా కేంద్రాల్లో సమర్పించాలి. బ్యాంకు ఖాతా నంబర్, బ్రాంచి పేరు, ఐఎఫ్ఎస్సీ కోడ్, ఫోన్ నంబర్ తదితర వివరాలు నమోదుచేయించుకోవాలి. దరఖాస్తుదారుల నుంచి దరఖాస్తు రుసుము తీసుకోవద్దని ప్రభుత్వ ఆదేశాల్లో స్పష్టంచేశారు. దరఖాస్తుల సంఖ్య ఆధారంగా ప్రభుత్వమే ఈ-సేవా, మీ సేవా-కేంద్రాలకు డబ్బులు చెల్లిస్తుందని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు ఈ-సేవా, మీ-సేవా కేంద్రాల నుంచి దరఖాస్తులు తీసుకొని, వాటిని పరిశీలించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. దరఖాస్తులను పంచాయతీరాజ్, మున్సిపల్ అధికారులు పరిశీలించి, అర్హులో కాదో తేలుస్తారు. ఈ-సేవా, మీ-సేవా కేంద్రాలు వెంటనే దరఖాస్తులు స్వీకరించేవిధంగా ఏర్పాట్లుచేయాలని ఆదేశించారు.
దేశంలో ఎక్కడా లేనివిధంగా: మంత్రి ఎర్రబెల్లి
వృద్ధాప్య పింఛన్లకు అర్హులైన వారందరూ దరఖాస్తు చేసుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడాలేని విధంగా ఆసరా పింఛన్‌గా నెలకు రూ.2,016 అందజేస్తున్నదని శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.