ఏర్గట్ల, నవంబర్ 28: తనను ప్రేమించి పెండ్లి చేసుకుంటానని చెప్పి ఇంకొకరిని పెండ్లి చేసుకుందని మనస్తాపం చెందిన యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో కుటుంబసభ్యులు అతడి మృతదేహాన్ని నడిరోడ్డుపై పోలీసు వాహనం మీద ఉంచి ఆందోళనకు దిగారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలో చోటుచేసుకున్నది. దోంచంద గ్రామానికి చెందిన నాగిరెడ్డి శ్రీకాంత్ (29), అదే గ్రామానికి చెందిన యువతి ఆరేండ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఉన్నత చదువుల కోసం శ్రీకాంత్ లండన్ వెళ్లాడు. పెండ్లి చేసుకుందామని ప్రియురాలు రమ్మనడంతో 7 నెలల క్రితం తిరిగి వచ్చాడు. అయితే, ఈ నెల 6న ఆమె మరో వ్యక్తిని పెండ్లి చేసుకోవడంతో మనస్తాపం చెందిన శ్రీకాంత్ గడ్డిమందు తాగాడు.
హైదరాబాద్లోని ఓ దవాఖానలో చికిత్సపొందిన అతడు గురువారం మృతిచెందాడు. తమ కుమారుడిని మోసం చేసిన ప్రియురాలిపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చే శారు. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్న ఆగ్రహంతో బంధువులు, గ్రామస్థులు శుక్రవారం ఉదయం మృతదేహంతో ఏర్గట్ల పోలీసుస్టేషన్ ముట్టడికి తరలివచ్చారు. పోలీసులు అడ్డుకోవడంతో మృతదేహాన్ని పోలీసువాహనంపై పెట్టి ఆందోళనకు దిగారు. ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వరరెడ్డి వచ్చి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.