తన తండ్రిని పోలీసులు వేధిస్తున్నారంటూ ఓ యువకుడు విద్యుత్తు టవర్ ఎక్కి ఆందోళనకు దిగాడు. ఎస్సార్ నగర్‌కు చెందిన కుదురుపాక వెంకటేశ్వర్లు (కేవీ స్వామి)కు, అతడి బంధువులకు మధ్య ఆర్థిక లావాదేవీల విషయమై పెద్దల సమక్షంలో పంచాయితీ జరుగుతున్నది. వెంకటేశ్వర్లు తన బంధువులకు డబ్బులు ఇవ్వాల్సి ఉన్నట్టు తేలింది. ఇబ్బందులకు గురిచేస్తుండటంతో రంగశాయిపేటకు చెందిన వారు మిల్స్‌కాలనీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మిల్స్ కాలనీ పోలీసులు వెంకటేశ్వర్లును పిలిచి వివరాలు తెలుసుకున్నారు. తన తండ్రిని పోలీసులు ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ వెంకటేశ్వర్లు కుమారుడు జయప్రకాశ్ సోమవారం ఏనుమాములలోని సబ్ స్టేషన్ పక్కన గల టవర్ ఎక్కి ఆందోళనకు దిగాడు. ఇన్స్పెక్టర్ రమేశ్‌గౌడ్ చేరుకొని న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో అతడు కిందకు దిగాడు.
నాలుగు నెలలుగా జీతాలు ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ ఖమ్మం రూరల్ మండలం చిన్నతండాలోని ఓహెచ్‌బీఆర్ పరిధిలో పనిచేసే 21 మంది మిషన్ భగీరథ పంపు ఆపరేటర్లు సోమవారం విధులను బహిష్కరించారు. జీతాల కోసం మూడు నెలలుగా మొరపెట్టుకుంటున్నా కనీస స్పందన లేదని, తప్పనిసరి పరిస్థితుల్లో విధులను బహిష్కరించాల్సి వచ్చిందని వారు పేర్కొంటున్నారు. పీఎఫ్, ఈఎస్ఐ వాయిదాలను కూడా జమ చేయడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.