మిరుదొడ్డి, అక్టోబర్ 3 : ఆన్లైన్ బెట్టింగ్‌లో(Online betting) భారీగా డబ్బులు కోల్పోయి పురుగుల మందు తాగి యువ వ్యాపారి(Young businessman) ఆత్మహత్య(Committed suicide) చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లా అక్బర్పేట-భూంపల్లి మండలం రుద్రారంలో గురువారం చోటు చేసుకుంది. మిరుదొడ్డి ఎస్ఐ బి. పరశురా ములు వివరాల ప్రకారం..రుద్రారం గ్రామానికి చెందిన ఇదారి నవీన్ (27) వ్యవసాయ సంబంధిత రసాయన ఎరువులు గ్రామంలో రైతులకు విక్రయిస్తూ కుటుంబసభ్యులతో కలిసి జీవిస్తున్నాడు. ఈ క్రమంలో ఎలాంటి కష్టం లేకుండా సులభంగా ఆదాయం సమకూర్చుకోవాలనే ఉద్దేశంతో ఆన్లైన్ బెట్టింగ్‌లకు పాల్పడ్డాడు.
బెట్టింగ్‌లకు బానిసైన నవీన్ రూ.26 లక్షల వరకు బాకీలు చేసి అప్పుల ఊబిలో కూరుకు పోయాడు. నవీన్‌కు అప్పులు తీర్చే మార్గం కానరాక తీవ్ర మనస్తాపానికి గురై గురువారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన కుటుంబసభ్యులు నవీన్‌ను చికిత్స నిమిత్తం దవాఖానకు తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతిచెందాడు. మృతుడి భార్య రాధిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడికి భార్య, రెండేండ్ల కుమారుడు ఉన్నాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని దుబ్బాక ఏరియా దవాఖానకు తరలించారు.