కమాన్ పూర్ : ఆ ఊరిలో కోతుల బెడదతో గ్రామస్తులు బెంబేలెత్తిపోతున్నారు. కొన్ని రోజులుగా కోతులు గ్రామస్తులపై దాడులు చేసి గాయపరుస్తుండంతో ఆందోళన చెందుతున్నారు. తాజాగా పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండలం పెంచికల్ పేట్ గ్రామానికి చెందిన పల్లె లక్ష్మి అనే మహిళపై కోతి దాడి చేయడంతో తీవ్రంగా గాయపడింది.
గమనించిన స్థానికులు లక్ష్మిని కమాన్ పూర్ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకరాగా ప్రథమ చికిత్స అనంతరం గోదావరిఖని ప్రభుత్వ దవాఖానకు తరలించినట్లు సమాచారం. కాగా, ఇప్పటికే పెంచికల్ పేట్ గ్రామంలో సుమారు 50 మంది వరకు కోతుల దాడిలో గాయపడినట్లు తెలిసింది. కోతుల బెడదా తీవ్రంగా ఉందని.. కోతుల బారి నుంచి తమను రక్షించే విధంగా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.