మహబూబ్నగర్, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/భూత్పూర్: మానసిక దివ్యాంగురాలైన 35 ఏండ్ల యువతిపై ఆమె సమీప బంధువు లైంగికదాడికి ఒడిగట్టాడు. దీనిని గమనించిన అతని స్నేహితుడు కూడా ఆ యువతిని లొంగదీసుకుని లైంగికదాడికి పాల్పడటంతో బాధిత యువతి గర్భందాల్చింది. ఈ విషయం బయటపడడంతో రాజీ కుదుర్చుకున్నట్టు తెలిసింది. తీరా అది కూడా బెడిసికొట్టడంతో పోలీసులకు చేరిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ ఎస్సై చంద్రశేఖర్ కథనం ప్రకారం.. భూత్పూర్ మండలం కరివెన గ్రామంలో మానసిక దివ్యాంగురాలైన ఓ యువతిని ఆమె సమీప బంధువు పరమేశ్ లోబరుచుకొని కొన్నాళ్లుగా లైంగికదాడికి పాల్పడుతున్నాడు.
ఈ విషయం తెలిసిన అతని స్నేహితుడు శేఖర్ ఆ యువతిని బెదిరించి ఆమెపై తరచూ లైంగికదాడికి పాల్పడ్డాడు. ఇటీవలే ఆ యువతిపై కోతి దాడి చేయడంతో చికిత్స నిమిత్తం దవాఖానకు తల్లిదండ్రులు తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు ఆమె ఐదు నెలల గర్భవతి అని తేల్చారు.
ఆ యువతిపై పరమేశ్, శేఖర్ లైంగికదాడికి పాల్పడిన విషయం తేలింది. గ్రామంలో రాజీ కుదిరించేందుకు ప్రయత్నించారు. ఇద్దరూ కలిసి కొంత నగదు ఇచ్చేందుకు ఒప్పుకున్నట్టు సమాచారం. ఈ రాజీ బెడిసికొట్టడంతో కుటుంబ సభ్యులు భూత్పూర్ పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై వెల్లడించారు.