ముస్తాబాద్ (సిరిసిల్ల జిల్లా): ఒక కాన్పులో ఒక బిడ్డ జన్మించడం సహజం. అరుదుగా కొందరికి కవలలు జన్మిస్తుంటారు. కానీ, అత్యంత అరుదుగా కొందరు మహిళలు ఒకే కాన్పులో ముగ్గురు, నలుగురు బిడ్డలకు జన్మినిచ్చిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి అత్యంత అరుదైన ఘటనే ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. ముస్తాబాద్‌లోని పీపుల్స్ దవాఖానలో ఓ మహిళ ఒకే కాన్పులో నలుగురు శిశువులకు జన్మనిచ్చింది.
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం సముద్ర లింగాపూర్ గ్రామానికి చెందిన గొట్టెముక్కుల లావణ్య రెండో కాన్పు కోసం ముస్తాబాద్‌లోని పీపుల్స్ దవాఖానలో చేరింది. ఆమెకు అన్ని పరీక్షలు నిర్వహించిన వైద్యులు గర్భంలో నలుగురు శిశువులు ఉన్నట్లు గుర్తించి శస్త్రచికిత్స చేశారు. ముగ్గురు మగ శిశువులు, ఒక ఆడ శిశువు జన్మించారు. తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
కాగా, తల్లి గర్భంలో ఒకేసారి నాలుగు పిండాలు ఏర్పడటం అత్యంత అరుదని డాక్టర్ చింతోజి శంకర్ చెప్పారు. డాక్టర్ తేజస్విన్, డాక్టర్ అఖిల, ఇతర వైద్య సిబ్బంది లావణ్యకు శస్త్రచికిత్స నిర్వహించడంలో పాల్గొన్నారని తెలిపారు. ఇదిలావుంటే లావణ్యకు మొదటి కాన్పులో కొడుకు జన్మించాడు. ఇప్పడతనికి తొమ్మిదేళ్లు.