మామిళ్లగూడెం, ఏప్రిల్ 3: విడాకుల నోటీసులు ఇప్పించిందన్న అక్కసుతో భార్యను రోకలిబండతో మోది హత్య చేశాడు ఓ ప్రబుద్ధుడు. ఈ ఘటన ఆదివారం రాత్రి ఖమ్మం నగరంలో చోటుచేసుకున్నది. వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం పినపాకకు చెందిన ఎకిరాల దేవమణి(36) ఖమ్మం డిపోలో ఆర్టీసీ కండక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నది. 2006లో తన బంధువు తల్లాడ మండలం లక్ష్మీపురానికి చెందిన ఆటోడ్రైవర్ ఇనపనూరి రాంబాబు అలియాస్ రాములుతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. కొన్నేండ్ల తర్వాత భర్త మద్యం తాగొచ్చి వేధించేవాడు. విసుగు చెందిన దేవమణి కూతురు అశ్వితతో కలిసి ఖమ్మంలో అద్దెకు ఉంటున్నది. ఈ ఏడాది ఫిబ్రవరి 17న విడాకులు కావాలని భార్య భర్తకు కోర్టు నుంచి నోటీసులు పంపింది. ఆ నోటీసులు అందుకున్న భర్త భార్యపై కోపం పెంచుకున్నాడు. ఆదివారం రాత్రి రాంబాబు భార్య నివాసం ఉంటున్న ఇంటి వద్దకు వెళ్లి.. తనకు నోటీసులు ఇస్తావా అంటూ రోకలిబండతో భార్య తలపై కొట్టాడు. దీంతో దేవమణి తీవ్ర రక్తస్రావమై కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందింది. పాప కేకలు వేయడంతో స్థానికులు వచ్చి ఈ విషయాన్ని మృతురాలి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. మృతురాలి తండ్రి కోటయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ శ్రీధర్ తెలిపారు.
చండ్రుగొండ, ఏప్రిల్ 3: భార్యపై అనుమానంతో కత్తితో పొడిచి హతమార్చిన ఘటన భద్రాద్రి జిల్లా ములకలపల్లి మండలం మాదారంలో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా విస్సన్నపేటకు చెందిన నమిత (26)కు కొన్నేండ్ల క్రితం పాల్వంచ పట్టణానికి చెందిన ఆరింపుల రాజేశ్‌తో వివాహమైంది. కొద్దిరోజులుగా రాజేశ్ భార్యను అనుమానిస్తూ వేధిస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి భార్యను నమ్మబలికి మాదారంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. ఆమెపై విచక్షణారహితంగా కత్తితో దాడి చేసి అక్కడి నుంచి పారిపోయాడు. రక్తపుమడుగులో ఉన్న నమితను గ్రామస్థులు గుర్తించి పాల్వంచ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స అందిస్తుండగా మృతిచెందింది. ఘటనపై పాల్వంచ సీఐ నాగరాజు, ములకలపల్లి ఎస్సై సాయికిశోర్‌రెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు.