హైదరాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ): ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నటించిన ఓజీ సినిమా టికెట్ ధరల పెంపు నిర్ణయాన్ని రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల అమలును ద్విసభ్య ధర్మాసనం ఈ నెల 26వ తేదీ వరకు నిలిపివేసింది. దీంతో సినిమా నిర్మాతలకు తాతాలిక ఊరట లభించింది. ప్రభుత్వ మెమోపై 26న ఇరుపక్షాల వాదనలు విని తిరిగి ఉత్తర్వులు జారీ చేయాలని ఏకసభ్య ధర్మాసనాన్ని ఆదేశించింది.
ధరల పెంపు నిర్ణయాన్ని రద్దు చేస్తూ ఏకసభ్య ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలను డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ గురువారం ద్విసభ్య ధర్మాసనంలో సవాలు చేశారు. జస్టిస్ అభినందన్కుమార్ షావిలి, జస్టిస్ వాకిటి రామకృష్ణారెడ్డితో కూడిన డివిజన్ బెంచ్ దీనిని విచారించింది. ఈ నెల 24 నుంచి అక్టోబరు 4 వరకు ధరల పెంపునకు అనుమతినిచ్చినట్టు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. వాదనలు విన్న ధర్మాసనం సింగిల్ జడ్జి ఆదేశాలను 26 వరకు సస్పెండ్ చేస్తూ ఆదేశాలిచ్చింది.