Adilabad | హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో కొద్ది రోజులుగా రెండు పులుల సంచారం హడలెత్తించిన విషయం తెలిసిందే. జానీ అనే మగ పులి మహారాష్ట్రకు తిరిగి వెళ్లిపోవడంతో అధికారులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. మగపులి మహారాష్ట్ర బాటపట్టింది సరే.. మరి ఆడపులి ఎక్కడ? అనేది స్థానికుల్లో భయాందోళన కలిగిస్తున్నది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రెండు పులులు సంచారంతో అటు అధికారులు, ఇటు స్థానికులకు కంటి మీద కునుకులేకుండా చేశాయి.
ఈ రెండు పులుల్లో మగ పులి జాని అని మరోటి ఆడపులిగా అధికారులు గుర్తించారు. మేటింగ్ సీజన్ కావడంతో ఈ రెండు కలయిక కోసమే తిరుగుతున్నట్టు గ్రహించారు. వీటిపై గ్రామస్తులు దాడి చేయకూడదని అధికారులు ఆంక్షలు పెట్టారు. పశువులపై పులులు దాడి చేస్తే పరిహారం ఇస్తామని తెలిపారు. శుక్రవారం ఉదయం బేల రేంజి రాంపూర్ నుంచి కోర్పన అడవుల్లోకి జానీ ప్రవేశించిందని చెప్పారు. అక్టోబర్ 23 నుంచి నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలో పెద్దపుల్లి సంచరించినట్టు గుర్తించారు. ఆడపులి జాడ కోసం గాలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.