హైదరాబాద్, జనవరి 12(నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ రాజేంద్రనగర్ పరిధిలో మరోసారి చిరుత సంచారం కలకలం సృష్టించింది. వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మార్నింగ్ వాకర్స్‌కు చిరుత కనిపించింది. ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం వద్దకు వచ్చిన చిరుత.. అకడి నుంచి పొదల్లోకి వెళ్లిపోయినట్టు తెలిపారు. చిరుత సంచారంతో విద్యార్థులు, మార్నింగ్ వాకర్స్ భయాందోళన చెందుతున్నారు. గతంలోనూ వర్సిటీ క్యాంపస్ పరిసరాల్లో చిరుతపులి సంచరించగా అధికారులు బంధించారు. చిరుత శంషాబాద్, గగన్‌పహాడ్‌లోని రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో ఉంటూ హిమాయత్‌సాగర్, శంషాబాద్, రాజేంద్రనగర్, మొయినాబాద్ చుట్టూ సంచరిస్తున్నట్టు అటవీశాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
హైదరాబాద్, జనవరి 12 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో 268 ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ(ఐటీడీఏ) ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి. 20 ఏండ్ల క్రితం నియమించిన 2102 మంది కాంట్రాక్టు టీచర్లే ఆ పాఠశాలలకు దిక్కయ్యారు. ప్రస్తుతం స్వరాష్ట్రంలో అదే కాంగ్రెస్ సర్కారు అధికారంలో ఉన్నప్పటికీ తమను పట్టించుకోవడం లేదని సీఆర్టీలు వాపోతున్నారు. సీఆర్టీలను రెగ్యులర్ చేసే క్రమంలో జీవో-16పై కాంగ్రెస్ రాద్ధాంతం చేసింది. దీంతో కోర్టు స్టేతో రెగ్యులరైజేషన్ ఆగిపోయింది. అప్పటి నుంచి మంత్రులు, అధికారుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకుండాపోయింది. చివరకు చేసేది లేక 19 రోజులు నిరసన దీక్షలు చేపట్టారు. ఈ క్రమంలో రేవంత్ సర్కారు వారిని చర్చలకు పిలిచింది కానీ, రెగ్యులరైజేషన్‌పై ఎలాంటి హామీ ఇవ్వలేదు. వార్షిక పరీక్షలు ముంచుకొస్తున్నా ప్ర భుత్వం ఆ ఊసే ఎత్తకపోవడంపై మరోసారి తమ పోరాట కార్యాచరణ ప్రకటిస్తామని ఆ సంఘం నాయకుడు సతీశ్ హెచ్చరించారు.