Asifabad | ఆసిఫాబాద్ : ఓ విద్యార్థి పుట్టిన రోజునే అనంతలోకాలకు వెళ్లిపోయాడు. మరికొద్ది గంటల్లోనే పుట్టిన రోజు జరుపుకోవాల్సి ఉండగా, అంతలోనే ఆ విద్యార్థి గుండె ఆగిపోయింది. పుట్టిన రోజునే కుమారుడు మరణించడంతో.. అతని తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. ఈ విషాద ఘటన కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని బాబాపూర్‌లో గురువారం రాత్రి చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. బాబాపూర్‌కు చెందిన చునర్కార్ గుణవంత్ రావు, లలిత దంపతులకు ముగ్గురు కుమారులు ఉన్నారు. వీరిలో చిన్న కుమారుడు సచిన్(16). ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాల్లో మంచి మార్కులు సాధించాడు. ఇక శుక్రవారం(మే 19) అతను బర్త్‌డే కావడంతో.. షాపింగ్ కోసం ఆసిఫాబాద్‌కు వెళ్లాడు. ఆసిఫాబాద్‌లో షాపింగ్ చేస్తుండగానే.. ఛాతీలో నొప్పిగా ఉందని పేరెంట్స్‌కు చెప్పాడు సచిన్. దీంతో హుటాహుటిన కుమారుడిని సమీప ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం మంచిర్యాలకు తరలిస్తుండగా, మార్గం మధ్యలో గుండెపోటుతో మృతి చెందాడు. దీంతో మృతదేహాన్ని కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకువచ్చారు.
పుట్టిన రోజు వేడుకలకు మరికొన్ని గంటలు ఉందనగా, గుండెపోటుతో మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అర్ధరాత్రి 12 గంటలకు శోకసంద్రంలోనే సచిన్ డెడ్‌బాడీ వద్ద కేక్ కట్ చేశారు. ఒక్కసారిగా తల్లిదండ్రులు, గ్రామస్తులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. శుక్రవారం ఉదయం అంత్యక్రియలు నిర్వహించారు.