ఖైరతాబాద్, జనవరి 6: పబ్జీ గేమ్ ఓ విద్యార్థి ప్రాణం తీసింది. ఆన్లైన్ ఆటకు బానిసైన అతడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం ఈ విషాద ఘటన చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్లారెడ్డిగూడలోని గుమ్మడి అపార్ట్‌మెంట్స్‌లో పీ జయ తన కొడుకు అఖిల్ (21)తో కలిసి నివాసం ఉంటున్నారు. 2018లో భర్త విశ్వనాథ్ చనిపోవడంతో కొడుకు బాధ్యతలను ఆమె చూసుకుంటున్నది. శనివారం తన స్నేహితురాలి ఇంటికి వెళ్లి వస్తానని చెప్పి జయ బయటకు వెళ్లారు.
కొద్ది సేపటికి ఆమె ఫోన్ వాట్సాప్‌లో ‘బైబై మమ్మీ.. లవ్ యూ జాగ్రత్త’ అంటూ మెసేజ్ వచ్చింది. వెంటనే కొడుకుకు ఫోన్ చేయగా, స్విచ్ఛాఫ్ వచ్చింది. అపార్టుమెంట్‌కు వెళ్లి చూడగా, తలుపులు వేసి ఉన్నాయి. ఎంత పిలిచినా అఖిల్ పలుకకపోవడంతో వాచ్మెన్ సాయంతో తలుపులు పగులగొట్టి లోనికి వెళ్లి చూడగా, ఉరివేసుకొని కనిపించాడు. వెంటనే చుట్టుపక్కల వారి సాయంతో నిమ్స్ దవాఖానకు తరలించగా, అప్పటికే చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. తన కొడుకు కొంతకాలంగా పబ్జీ గేమ్ ఆడుతుండే వాడని, ఆ వ్యసనమే ప్రాణాలు తీసిందని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.