జగిత్యాల, మే 30 (నమస్తే తెలంగాణ): ‘కల్లంలో వడ్లు చూస్తే.. కండ్లన్నీ నీళ్ల చెరువులవుతున్నయ్.. రాజకీయం పాడుగాను.. రైతుగోస చూడబోరు.. రైతు బతుకు ఏమీ బతుకు చూడరో’ అంటూ ఓ యువ రైతు వడ్ల కల్లం వద్ద పాడిన పాట సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కన్నీరు పెడుతూ, కల్లం వద్ద పోసిన వరి కుప్పను చూస్తూ రైతు స్వయంగా రాసి పాడిన పాటపై పలువురు రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం సర్వాపూర్కు చెందిన రైతు బొద్దుల మహేందర్ తనకున్న రెండెకరాల్లో వరి సాగు చేశాడు. గత నెల 24న పంట కోసి స్థానిక పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో వడ్లు పోశాడు. నెల రోజులైనా తూకం వేయకపోవడంతో తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. బుధవారం రాత్రి కురిసిన వర్షానికి వడ్లు తడువగా, గురువారం ఆరబోశాడు. ఈ క్రమంలో మహేందర్ శుక్రవారం ధాన్యం అమ్ముకునేందుకు రైతులు పడుతున్న కష్టాలపై పాట రాశాడు. పాటను ధాన్యం కుప్ప వద్ద పాడుతుండగా కొందరు సెల్ఫోన్లలో వీడియో తీసి ఎస్ఎంలో పోస్టు చేయగా వైరలవుతున్నది.
ఇదేం గోసనేమో?
మహేందర్ మాట్లాడుతూ.. ‘సార్… ఆరునెలలు కష్టపడి పంట పండించాం. ధాన్యం తెచ్చి సెంటర్లో పోసి నెలపైనే అయ్యింది. ఇంతవరకు మా ముఖం చూసినోళ్లు లేరు’ అని ఆవేదన చెందాడు.