BJP | ప్రజాసంక్షేమం, అభివృద్ధిని ఎల్లవేళలా కోరుకొనే వాడే అసలైన నాయకుడు. పరిపాలనకు అర్హుడు. యుద్ధంలో అయినా.. రాజకీయ క్షేత్రంలో అయినా.. రాచ మార్గంలో పోటీలో నిలబడి గెలవాలి. చేసిన అభివృద్ధిని చూపించి ప్రజల మెప్పును పొంది విజయలక్ష్మిని వరించాలి. దొంగాటతో దొడ్డి దారిన కుట్రలకు తెగబడితే అది వీరత్వం అనిపించుకొంటుందా?!
రానున్నది ఎన్నికల సీజన్. పదేండ్లలో చేసిన అభివృద్ధి ఏమీ లేకపోవడంతో.. అసత్య, అభూత కల్పనలతో ఓటర్లను మభ్యపెట్టడానికి బీజేపీ సిద్ధమయ్యింది. ఓటర్లను ప్రభావితం చేయడానికి కుట్రలకు తెరతీసింది. ఇందులో భాగంగా ‘చతుర్ముఖ వ్యూహాల’తో పావులు కదుపుతున్నట్టు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది.
కర్తలు: పార్టీకి చెందిన ప్రత్యేక బృందాలు, రాజకీయ వ్యూహకర్తలు, గ్రాడ్యుయేట్ విద్యార్థులు.
ఏం చేస్తారు?: స్థానికంగా పలుకుబడి ఉన్న ఓ ప్రభావశీల వ్యక్తిని ఎమోషనల్‌గా రెచ్చగొట్టి దారికి తెచ్చుకొంటారు. తద్వారా వందలమందిని ప్రభావితం చేస్తారు.
పని జరిగేది ఇలా: ఓ గ్రామంలో లేదా ప్రాంతంలో పలుకుబడి ఉండి, కనీసం వంద మందిని ప్రభావితం చేయగల వ్యక్తిని ముందుగా గుర్తిస్తారు. అతను రాజకీయాలకు సంబంధించిన వ్యక్తే కానవసరంలేదు. అలా వ్యక్తిని గుర్తించిన అనంతరం.. అతని కుటుంబ వ్యవహారాలు, ఈ స్థాయికి రావడానికి జీవితంలో ఆ వ్యక్తి ఎదుర్కొన్న ఆటుపోట్లతో పార్టీకి చెందిన ప్రత్యేక బృందాలు, రాజకీయ వ్యూహకర్తల టీమ్ ఓ రిపోర్టును తయారు చేస్తుంది. అనంతరం ఆ వ్యక్తి పేరుతో.. అతను లేదా ఆమె జీవితంలో జరిగిన ఓ విషాదకరమైన ఘటనను ప్రస్తావిస్తూ కొందరు విద్యార్థుల సాయంతో పార్టీ అధినాయకత్వం రాసినట్టుగా ఓ ప్రత్యేక లేఖ రాయిస్తారు. ‘మీరెంతో గొప్ప వ్యక్తి. మీలాంటి వారిని మేం ఇంతవరకూ చూడలేదు. మా పార్టీ తరుఫున మీకు ఇప్పటికే ఏదో ఓ సాయం చేయాల్సింది. అది జరుగలేదు. మీరు ఫలాన సమయంలో తీసుకొన్న నిర్ణయం ఎంతో గొప్పది. అది ఎంతో మందికి ఆదర్శంగా నిలిచింది’ అంటూ ఎమోషనల్‌గా లక్షిత వ్యక్తిని దారికి తెచ్చుకొంటారు. ఒకసారి సదరు వ్యక్తి తమ దారికి వచ్చాడని అంచనాకు రాగానే ఆ వ్యక్తి ద్వారా వందలమందిని ప్రభావితం చేయడానికి కొత్త వ్యూహాలు రచిస్తారు. ఒకవేళ, ఆ వ్యక్తి దారికిరాకపోతే.. అలా వచ్చేవరకూ కొత్త పంథాలో లేఖల పరంపర కొనసాగుతుంది. వచ్చే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల కోసం దేశంలోని 766 జిల్లాల్లో.. ఒక్కో జిల్లాలో కనీసం వందమంది చొప్పున ప్రభావశీల వ్యక్తులను ఇప్పటికే బీజేపీ ప్రత్యేక టీమ్‌లు గుర్తించాయి. ఆయా వ్యక్తులకు లేఖలు రాయడానికి డిగ్రీ పాసైన విద్యార్థులను నియమించుకోవడమే కాదు.. ఆ ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించినట్టు కూడా తెలుస్తున్నది.
కేస్ స్టడీ: డాక్టర్ నరసింహారావు (పేరుమార్చాం) కార్పొరేట్ దవాఖానల్లో లక్షల్లో ఖర్చయ్యే ఆపరేషన్లను తక్కువ ఫీజుతో విజయవంతంగా పూర్తి చేయడంతో ఆయనంటే పలువురికి ఎంతో అభిమానం. దీన్ని గ్రహించిన ఓ పార్టీ స్ట్రాటజిక్ టీమ్ సభ్యులు.. నరసింహారావు వ్యక్తిగత జీవితంలోని ఆటుపోట్లను పరిచయస్తుల ద్వారా తెలుసుకొన్నారు. అనంతరం నియమించుకొన్న విద్యార్థులతో పార్టీ అధినాయకత్వం రాసినట్టుగా ఆయనకు ఓ లేఖ రాశారు. కారు ప్రమాదంలో భార్య, పిల్లలను కోల్పోయినప్పటికీ సమాజానికి ఎంతో సేవ చేస్తున్న మీలాంటి వారు మహాత్ములతో సమానమంటూ ఆయనను ఆకాశానికి ఎత్తారు. మీకు మా పార్టీ ఏమీ చేయలేకపోయినందుకు చింతిస్తున్నామంటూనే.. అధికారంలోకి వస్తే తప్పకుండా తగిన గుర్తింపునిస్తామంటూ ఎరవేయడం ప్రారంభించారు. దీంతో ఆ అబద్ధపు విష వలయంలో నరసింహారావు చిక్కుకుపోయారు. రోగులు, సన్నిహితులకు సదరు పార్టీ గురించి హితబోధ చేయడం ప్రారంభించారు.
కర్తలు: ఇజ్రాయెల్‌కు చెందిన ‘టీమ్ జార్జ్’ హ్యాకింగ్ ఏజెన్సీ
ఏం చేస్తారు?: సోషల్ మీడియా ఖాతాలను హ్యాక్ చేసి.. సందేశాలను ఏమార్చి.. విషప్రచారం చేస్తారు.
పని జరిగేది ఇలా: తమతో ఒప్పందాన్ని కుదుర్చుకున్న రాజకీయ పార్టీకి అనుకూలంగా విస్తృత స్థాయిలో ప్రచారాన్ని కల్పించడమే లక్ష్యంగా ‘టీమ్ జార్జ్’ హ్యాకింగ్ ఏజెన్సీ పనిచేస్తుంది. దీని కోసం అప్పటికే తమ దగ్గర ఉన్న డేటాబేస్‌లోని లక్షలాది మంది సామాజిక మాధ్యమ ఖాతాలను వాడుకొంటుంది. అలాగే, ఆన్లైన్లో లక్షలాది ఫేక్ అకౌంట్లను సృష్టిస్తుంది. అప్పటికే మనుగడలో ఉన్న అకౌంట్లను కూడా నియంత్రణలోకి తీసుకొంటుంది. ఇవన్నీ ఒక క్రమ పద్ధతిలో అమరాక.. తమతో డీల్ కుదుర్చుకొన్న పార్టీకి అనుకూలంగా ప్రచారాన్ని ముమ్మరం చేస్తుంది. దీని కోసం.. ‘అడ్వాన్స్డ్ ఇంప్యాక్ట్ మీడియా సొల్యూషన్స్ (ఎయివ్ అనే అధునాతన సాఫ్ట్‌వేర్‌ను వినియోగిస్తుంది. ఏ భాషలోనైనా ఫేక్ వార్తలను ప్రచారం చేసేలా దీన్ని రూపొందించారు. ఒకేసారి 30 వేల ఆన్లైన్ అకౌంట్స్‌ను నియంత్రించగల బృందం ఈ ఏజెన్సీ దగ్గర ఉన్నది. ఇప్పటికే 33 దేశాల ఎన్నికలను ప్రభావితం చేసినట్టు ‘టీవ్ు జార్జ్’ అధిపతి తాల్ హనన్ చెప్పారు. భారత్‌తో సహా 20 దేశాల్లో పలు అంశాల్లో ‘టీమ్ జార్జ్’ జోక్యం చేసుకొన్నది. ప్రస్తుతం భారత్‌లో ఓ ప్రధాన పార్టీ కోసం పనిచేస్తున్నట్టు హనన్ చెప్పారు. ఆ పార్టీ బీజేపీ అన్న వార్తలు వస్తున్నాయి.
కేస్ స్టడీ: ప్రైవేటు చిరుద్యోగి రమ్య (పేరు మార్చాం) మూడేండ్ల కూతురికి గుండె నాళాల్లో సమస్య ఉన్నదని, చికిత్సకు ఐదు లక్షలు అవసరమని వైద్యులు వివరించారు. అంత పెద్ద మొత్తాన్ని చెల్లించలేని ఆమె ఓ రాష్ట్ర మంత్రితో మొరపెట్టుకొన్నారు. వెంటనే ఆపరేషన్‌కు మంత్రి ఏర్పాట్లు చేయడంతో ధన్యవాదాలు చెప్తూ రమ్య ట్వీట్ చేశారు. అయితే రెండు రోజుల్లోనే ఆ పోస్టులోని విషయం విరుద్ధంగా మారిపోయింది. తమ పాపకు సాయం చేయమని అడిగితే మంత్రి నిరాకరించినట్టు, అధికారపార్టీ ఏ మాత్రం పట్టించుకోనట్టు అబద్ధపు రాతలు ప్రత్యక్షమయ్యాయి. కొన్ని రోజుల తర్వాత ఆ పోస్టులు డిలీట్ అయ్యాయి.
కర్తలు: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టూల్స్ క్లాగర్, డాగర్
ఏం చేస్తారు?: తప్పుడు సందేశాలు పంపి ఒప్పందం కుదుర్చుకొన్న పార్టీకి ఓటర్లను ఆకర్షితులను చేస్తారు.
పని జరిగేది ఇలా: ఒక అబద్దాన్ని ఐదారుసార్లు చెప్పగానే నిజమనుకొనే రోజులివి. అందుకే సోషల్‌మీడియాలో ఫేక్ వార్తలు త్వరగా వైరల్ అవుతున్నాయి. సరిగ్గా ఈ సూత్రాన్నే ఆపరేషన్ ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) విధానంలో ఉపయోగిస్తారు. ముందస్తుగా ప్రొగ్రామింగ్ చేసిన బాట్ (యంత్రాలు) సాయంతో ఒప్పందం కుదుర్చుకొన్న పార్టీకి లాభం చేకూర్చేలా ఓటర్లకు పదేపదే సందేశాలు పంపుతారు. ఒకసారి ఓటర్ తమ మెసేజ్‌లకు స్పందించగానే.. మూడు దశల్లో ఏఐ పనిని ప్రారంభిస్తుంది. తమతో డీలింగ్ కుదుర్చుకొన్న పార్టీపై ఓటర్ వ్యక్తపర్చిన అభిప్రాయాలు పాజిటివ్‌గా ఉంటే ఆ సమాధానాలను రికార్డు చేసి కొత్తవారికి సర్వే రిపోర్టులుగా ఏఐ పంపుతుంది. ఒకవేళ ప్రతికూలంగా ఉంటే, ఆ ఓటర్ను పలుమార్లు వేర్వేరు అంశాలతో మభ్యపెడుతుంది. పని జరుగకపోతే.. దేశభద్రత, జాతీయవాదం, మతం తదితర సెంటిమెంట్లను యాడ్ చేసి ఓటర్ను తన దారికి తెచ్చుకొని తమ ైక్లెయింట్ ఆశిస్తున్న అంశాలను మెల్లిగా ఓటర్‌కు ఇంజెక్ట్ చేస్తుంది. ఓటర్ల బ్రౌజింగ్ హిస్టరీని ఆధారంగా చేసుకొని వారి ఇష్టాలకు అనుగుణంగా ఏఐ లాంగ్వేజ్ మోడల్ లక్షల కొద్దీ ప్రకటనలు గుప్పిస్తుంది. ఒకసారి దారిలోకి వచ్చిన ఓటర్ను తమ ైక్లెయింట్కు ఓటేసేలా ఏఐ పైవిధంగా ఆపరేషన్‌ను రిపీట్ చేస్తుంది. వచ్చే ఎన్నికల్లో ఏఐ టూల్స్‌ను బీజేపీ పెద్దయెత్తున వినియోగించబోతున్నదని నివేదికలు చెబుతున్నాయి. చాట్‌జీపీటీని సృష్టించిన ఓపెన్ ఏఐ కంపెనీ సీఈవో ఆల్ట్‌మన్‌తో ఇటీవల ప్రధాని మోదీ ఏకాంతంగా భేటీ కావడం ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నది.
కేస్ స్టడీ: కమలాకర్ (పేరు మార్చాం) చిరుద్యోగి. ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న అధికార పార్టీ అంటే ఆయనకు అభిమానం. ఫోన్లో వార్తలు చదవడం ఆయనకు అలవాటు. అలా ఇటీవల ఓ ప్రధాన తెలుగు వార్తాసైటును ఓపెన్ చేయగానే.. మెయిన్ వార్త పక్కన.. ‘హాయ్ కమలాకర్.. ఈ వార్త మీ కోసమే’ అంటూ ఓ యాడ్ కనిపించింది. అదేంటో చూద్దామని కమలాకర్ ఆ యాడ్‌పై క్లిక్ చేశాడు. ఓ విండో ఓపెన్ అయింది. ‘మీరు ఏం చేస్తుంటారు? ఏ పార్టీ అంటే మీకు అభిమానం? దానికి గల కారణాలేంటి?’ అనే ప్రశ్నలు ఒకదానికొకటి రావడంతో పాటు ఓ లైవ్ చాటింగ్ సెషన్ ప్రారంభమయ్యింది. అలా అరగంటపాటు చాట్‌లో మునిగిపోయిన కమలాకర్‌పై ఆ బాట్ తనతో ఒప్పందం కుదుర్చుకొన్న పార్టీకి అనుకూలంగా తప్పుడు వార్తలను వెదజల్లింది. ఈ వ్యవహారం పక్షంపాటు కొనసాగింది. నిజాలేంటో గ్రహించలేని కమలాకర్.. తనకు తెలియకుండానే డీలింగ్ పార్టీకి సానుభూతిపరుడిగా మారిపోయాడు.
కర్తలు: స్థానిక అల్లరిమూకలు, పార్టీ సానుభూతిపరులు
ఏం చేస్తారు?: పార్టీ ప్రభావం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో మత ఘర్షణలు, అల్లర్లను సృష్టించి లబ్ధిపొందడం.
పని జరిగేది ఇలా: గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో తమ పార్టీ తక్కువ స్థానాలను గెలుచుకొన్న ప్రాంతాలను గుర్తిస్తారు. ఇతర మతాల జనాభా ఎక్కువగా ఉన్నట్లయితే, మత ఘర్షణలు, అల్లర్లు సృష్టించి ఒక వర్గం ఓట్లను రాబట్టుకొనేందుకు ప్రయత్నిస్తారు. దీనికోసం లక్షిత మతవర్గానికి చెందిన షాప్‌లు, వ్యాపార సముదాయాలపై మరో మతాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు రాస్తారు. అవి రాసింది.. ఆ షాప్ యజమానులే అని భ్రమించి గొడవలు మొదలవుతాయి. బీజేపీ ఈ దిశగా ఇప్పటికే చర్యలు మొదలుపెట్టినట్టు ఆ పార్టీ నేతల ప్రకటనలను బట్టి తెలుస్తున్నది. ‘బీహార్‌లోని సీమాంచల్‌లో ఓట్లు రాబట్టేందుకు బంగ్లాదేశీ ముస్లింల చొరబాట్లు, గోవధ, లవ్ జీహాద్, ముస్లింల జనాభా పెరుగుదల వంటి ఆంశాలు మాకు ఉండనే ఉన్నాయి’ అంటూ బీహార్ బీజేపీ అధ్యక్షుడు సామ్రాట్ చౌదరీ ప్రకటించారు. దీన్ని ధ్రువపరుస్తూ మణిపూర్, అస్సాం, బీహార్, ఉత్తరాఖండ్ ఇలా ఒక్కో రాష్ట్రంలో లక్షిత ప్రాంతాల్లో ఏదో ఓ గొడవ జరుగుతూనే ఉన్నది. అల్లర్లు జరుగుతున్న ప్రాంతాలు 2019 ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయినవి లేదా తక్కువ మెజారిటీతో గెలిచినవే కావడం గమనార్హం.
– స్పెషల్ టాస్క్ బ్యూరో, హైదరాబాద్ (నమస్తే తెలంగాణ)