హైదరాబాద్, సెప్టెంబర్ 11(నమస్తే తెలంగాణ): పిల్లలు ప్రయోజకులైనప్పుడు ఆ తండ్రి గుండె సంతోషంతో ఉప్పొంగిపోతుం ది. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు తనకంటే పెద్ద హోదాను అందుకోవడంతో సెల్యూట్ చేస్తూ ఓ తండ్రి భావోద్వేగానికి లోనైన అరుదైన ఘటనకు ఎస్సై ట్రైనీ క్యాడెట్ల మూడో దీక్షాంత్ పరేడ్ వేదికైంది. రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఏఆర్ ఏఎస్సైగా విధు లు నిర్వర్తిస్తున్న జీ రాంచందర్రావు కూతురు సౌమ్య తన విభాగంలోనే ఎస్సైగా శిక్షణ పూర్తి చేసుకోవడంతో ఆయన ఆనందానికి అవధులు లేవు. బుధవారం పరేడ్ పూర్తి చేసుకున్న అనంతరం తన కూతురికి ‘సెల్యూట్’ చేశారు. బ్యాచ్లో టాప్-10లో చోటు సంపాదించడం, సీఎం రేవంత్రెడ్డి నుంచి ‘చీఫ్ మినిస్టర్స్ రివాల్వర్ బెస్ట్ అండ్ బెస్ట్ ఆల్ రౌండర్’ ‘హోం మినిస్టర్ బాటెన్ విత్ సిల్వర్ ఎండ్ ఫర్ బెస్ట్ ఇండోర్’ అవార్డులు అందుకోవడం గర్వంగా ఉందని రాంచందర్రావు పేర్కొన్నారు. మొదటి సెల్యూట్ తండ్రి నుంచే దక్కడంతో ఏఆర్ ఎస్సై సౌమ్య భావోద్వేగానికి లోనయ్యారు.