RIMS | ఆదిలాబాద్ : కేవలం 500 గ్రాముల బరువుతో అంటే అర కిలో బరువుతో పుట్టిన శిశువు ప్రాణాలను కాపాడేందుకు రిమ్స్ డాక్టర్లు విశ్వప్రయత్నం చేస్తున్నారు. గత మూడు రోజుల నుంచి ఆ పసిబిడ్డకు చికిత్స అందిస్తూ.. ఊపిరి పోసేందుకు శాయశక్తుల కృషి చేస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. ఆదిలాబాద్ జిల్లాలోని శాంతినగర్‌కు చెందిన ఓ గర్భిణికి ఆరు నెలలు. అయితే ఆమె బుధవారం మధ్యాహ్నం రిమ్స్ ఆస్పత్రిలో చేరి ప్రసవమైంది. కేవలం అర కిలో బరువున్న ఆడశిశువుకు జన్మనిచ్చింది. పసికందు బరువు 500 గ్రాములు మాత్రమే ఉండడంతో.. స్పెషల్ న్యూబోర్న్ కేర్ యూనిట్లో చేర్చారు. ఇక డాక్టర్ అనంత్రాం ఆధ్వర్యంలో మూడు రోజులుగా ఆ ఆడశిశువుకు ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. అతి తక్కువ బరువుతో ముందస్తుగా జన్మించిన శిశువులు బతకడం అరుదని వైద్యులు పేర్కొన్నారు. ఈ శిశువు ఇప్పటి వరకు బతికి ఉండడం అదృష్టమన్నారు. పాప ప్రాణాలను నిలిపేందుకు తాము శాయశక్తులా కృషి చేస్తున్నామని డాక్టర్లు స్పష్టం చేశారు.