హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ): ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ పరిశోధకులు రూపొందించిన మ్యూజిక్ అల్గారిథానికి బ్రేవ్ న్యూ ఐడియా అవార్డు దక్కింది. ఈ నెల 4నుంచి 8 తేదీల్లో బెంగళూరు వేదికగా జరిగిన 3వ ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ మ్యూజిక్ ఇన్ఫర్మేషన్ రిట్రీవల్ కాన్ఫరెన్స్-2022 (ఐఎస్ఎంఐఆర్)లో అవార్డుకు ఎంపిక చేశారు. ‘సోనస్ టెక్స్రే-ఆటోమేటెడ్ డెన్స్ సౌండ్‌ట్రాక్ కన్స్ట్రక్షన్ ఫర్ బుక్స్ యూజింగ్ మూవీ అడాప్టేషన్స్’ పేరుతో పూర్తిచేసిన ఈ ఆవిష్కరణకు పేటెంట్ పెండింగ్‌లో ఉన్నది.
ప్రొఫెసర్లు మకరంద్ తపస్వి, వినూ అల్లూరితోపాటు బీటెక్ విద్యార్థి జైదేవ్ శ్రీరామ్ బృందం ఈ అద్భుత ఆవిష్కరణ చేసింది. పుస్తకంలోని అంశాలను చదువుతున్నపుడు వాటికి సరిపడే, దృశ్యాల రూపం లో ఉన్నపుడు వచ్చే సంగీతాన్ని పఠన సమయంలోనూ ఆస్వాదించడమే ఈ మ్యూజిక్ అల్గారిథం ప్రత్యేకత.