హైదరాబాద్, ఫిబ్రవరి11 (నమస్తే తెలంగాణ): యాదాద్రి-భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం ప్యారారం గ్రామ సమీపంలో శిలాయుగపు చిత్రకళ వెలుగులోకి వచ్చింది. ప్రముఖ చరిత్రకారుడు శ్రీరామోజు హరగోపాల్, పురావస్తు పరిశోధకుడు ఈమని శివనాగిరెడ్డి నేతృత్వంలోని కొత్త తెలంగాణ చరిత్ర బృందం ఆ వర్ణ చిత్రాలను శనివారం పరిశీలించింది. ఊరికి ఉత్తరం దిక్కున 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిత్తారి గుట్టపైన వాటిని బృందం సభ్యులు కనుగొన్నారు. గుట్టపై ఒక రాతి ఆవాసపు గోడ, కప్పు భాగంలో మధ్య (సూక్ష్మ) రాతియుగం, కొత్తరాతి యుగపు మూపురం ఉన్న ఎద్దు బొమ్మలు 6, ఒక అడవి పంది, రెండు జింకలు, ఇద్దరు మనుషుల బొమ్మలను వారు గుర్తించారు. ఎర్ర జాజు రంగుతో, రేఖా చిత్ర రీతిలో ఉన్న ఈ బొమ్మలు ఆనాటి మానవుల చిత్రకళా నైపుణ్యాన్ని తెలియజేస్తున్నాయని వివరించారు. గుట్ట దిగువన సూక్ష్మరాతి పనిముట్లు, ఒక కొత్తరాతి యుగపు రాతి గొడ్డలి, గొడ్డళ్లను అరగదీసిన గుంతలను కూడా గుర్తించినట్టు తెలిపారు. అక్కడ లభించిన ఆధారాల వల్ల ఈ వర్ణచిత్రాలు క్రీస్తు పూర్వం 8,000-4,000 ఏండ్లనాటివని శివనాగిరెడ్డి వివరించారు. అదే రాతి ఆవాసంపైన చారిత్రక తొలియుగపు స్త్రీ బొమ్మ, శృంగార భంగిమలో ఉన్న మధ్యయుగాల నాటి రెండు జంటల చిత్రాలు కూడా ఉన్నాయని చెప్పారు. కార్యక్రమంలో బృందం సభ్యులు అహోబిలం కరుణాకర్, మహమ్మద్ నసీరుద్దీన్, కొరవి గోపాల్, మహమ్మద్ అన్వర్పాషా తదితరులు ఉన్నారు.