హైదరాబాద్, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ): ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ డెర్మటాలజిస్ట్స్, వెనెరాలజిస్ట్స్, లెప్రాలజిస్ట్స్ (ఐఏడీవీఎల్) నూతన జాతీయ కార్యవర్గం ఎన్నికైంది. ఇటీవల నిర్వహించిన ఐఏడీవీఎల్-2022 ఎన్నికల ఫలితాలను సోమవారం ప్రకటించారు. వచ్చే సంవత్సరానికి సంబంధించి అధ్యక్షుడిగా డాక్టర్ మంజునాథ్ షిండే, ప్రధాన కార్యదర్శిగా రాష్ర్టానికి చెందిన డాక్టర్ భూమేశ్కుమార్ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా డాక్టర్ సుషికుమార్, డాక్టర్ వినయ్సింగ్, గౌరవ సంయుక్త కార్యదర్శులుగా డాక్టర్ సుధావాణి, డాక్టర్ ప్రశాంత్జాదవ్, కోశాధికారిగా డాక్టర్ కవిత ఎన్నికయ్యారు. ఈ సంఘంలో మొత్తం 8,436 మంది సభ్యులు ఉన్నారు. ఇది ప్రపంచంలోనే రెండో అతి పెద్ద సంఘంగా గుర్తింపు పొందింది. ఈ-ఓటింగ్ విధానంలో గత నెల 31న పోలింగ్ నిర్వహించగా, 47 శాతం మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు.