బుధవారం 27 జనవరి 2021
Telangana - Jan 06, 2021 , 02:11:02

బిడ్డకు పాలివ్వొద్దా? నిర్మలమైన అమ్మ ఆవేదన

బిడ్డకు పాలివ్వొద్దా? నిర్మలమైన అమ్మ ఆవేదన

  • రూ.70 వేలకు కన్నబిడ్డను అమ్మిన తండ్రి
  • బాబు జాడ కనుగొన్న పోలీసులు
  • శిశువిహార్‌లో కొడుకు.. చెంతకు చేరలేని తల్లి
  • నిబంధనల అడ్డుతో ఐదురోజులుగా పడిగాపులు
  • అధికారుల చొరవతో పాలుపట్టేందుకు అంగీకారం

తన ఒడిలో వెచ్చగా హత్తుకొని నిద్రపోయిన బిడ్డ.. తెల్లారేసరికి కనిపించకుండాపోయాడు. బేజారైపోయిన తల్లి బజారంతా కలియదిరిగింది. కన్నీళ్లతో పోలీసులను ఆశ్రయిస్తే.. వాళ్లు కష్టపడి కొడుకును కనుగొన్నారు. కానీ.. కన్నబిడ్డను చెంతకు తీసుకోలేని దైన్యం. ఓ పక్క కండ్లముందే ఏడుస్తున్న బిడ్డ.. మరోవైపు ఊపిరిని ఉక్కిరిబిక్కిరిచేస్తున్న పాలసేపులు.. ఐదురోజులుగా అల్లాడిపోయిన తల్లినిచూసి చివరకు అధికారులకే కండ్లు చెమర్చాయి. నిబంధనలు అడ్డు రావడంతో బిడ్డను తల్లికి అప్పగించకపోయినా.. కరిగిపోయిన మానవత్వం ఆ బిడ్డకు తల్లిపాలను అందించింది. రూ.70 వేలకు పసివాడిని తండ్రి అమ్మిన ఘాతుకానికి తల్లీకొడుకు తల్లడిల్లిపోయిన గాథ ఇది. 

చాదర్‌ఘాట్‌/వెంగళ్‌రావునగర్‌: ఫుట్‌పాత్‌పైనే అయినా రాత్రిపూట అమ్మ ఒడిలో వెచ్చగా నిద్రపోయిన బాలుడు ఉదయానికల్లా మాయమయ్యాడు. పొత్తిళ్లను తడుముకొని.. బిడ్డ స్పర్శ తగలకపోవడంతో ఆ కన్నతల్లి ఉలిక్కిపడింది. చుట్టూతా చూసింది. బజారంతా కలియదిరిగింది. కన్నీళ్లతో పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు చిన్నారిని కనుక్కొని శిశువిహార్‌కు తరలించడంతో.. తల్లికి ఎక్కడలేని కష్టం మొదలైంది. నిబంధనలు అడ్డురావడంతో బిడ్డను హత్తుకోలేని పరిస్థితి. గుక్కెడు పాలను పట్టలేని దుస్థితి. ఒకవైపు బిడ్డ ఏడుపులు. మరోవైపు పాలసేపులు. ఐదు రోజులుగా పడిగాపులు. ఆమె హృదయ వేదనకు అధికారులు కరిగిపోయారు. బిడ్డకు చనుబాలు దక్కాయి. తల్లి గుండె మురిసింది. హృదయాలను మెలిపెట్టే ఈ ఘటన హైదరాబాద్‌లో వెలుగుచూసింది. 

ఫిర్యాదు అందిందే తడువుగా.. 

నిర్మల ఫిర్యాదు చేసిందే తడవుగా పోలీసులు అప్రమత్తమయ్యారు. చాదర్‌ఘాట్‌ సీఐ సతీశ్‌ ఎస్సై సంపత్‌ నేతృత్వంలో నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశారు. బాలుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నల్లగొండ చౌరస్తాలోని సీసీ ఫుటేజీలను పరిశీలించారు. అందులో ముగ్గురు మహిళలు బాలుడిని తీసుకెళ్తున్నట్టుగా గుర్తించారు. ఆ దిశగా ఎంక్వయిరీని చేపట్టారు. మహిళలు వెళ్లిన దిశలోని సీసీ కెమెరాల ఫుటేజీలను ఒక్కొక్కటిగా పరిశీలించి ముందుకుసాగారు. తుదకు ఎల్బీనగర్‌ నియోజకవర్గంలోని ఎన్టీఆర్‌ నగర్‌కు చెందిన ఓ మహిళ వద్ద బాబు ఉన్నట్లు గుర్తించారు. ఆమెను అదుపులోకి తీసుకొని విచారించగా అసలు నిజాలు వెలుగుచూశాయి. బాలుడి తండ్రి రాజు రూ.70 వేలకు తనకు విక్రయించాడని ఆమె వెల్లడించడంతో అధికారులు నివ్వెరపోయారు. నిందితురాలితోపాటు రాజును అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు మహిళల కోసం గాలిస్తున్నారు. 

తల్లి పడిగాపులు..    

బాబు అచూకీని డిసెంబర్‌ 31న పోలీసులు గుర్తించారు. ఫిర్యాదు సమయంలో తల్లి నిర్మల తనకు సంబంధించిన ఎలాంటి సమాచారం, కాంటాక్ట్‌ నంబర్‌ ఇవ్వకపోవడంతో అధికారులు నేరుగా మలక్‌పేట చౌరస్తాకు చేరుకున్నారు. అక్కడా నిర్మల కనిపించకపోవడంతో అధికారులు ఆమె జాడ కోసం ఆరా తీశారు. ఫలితం లేకపోవడంతో తుదకు బాలుడిని యూసుఫ్‌గూడలోని శిశువిహార్‌ నిర్వాహకులకు అప్పగించారు. మరుసటి రోజు ఉదయమే తల్లి నిర్మల ఠాణాకు చేరుకోగా, బాలుడి అచూకీ లభించిన విషయం తెలుపడంతోపాటు, ఒక కానిస్టేబుల్‌ను ఇచ్చి మరీ ఆమెను శిశువిహార్‌కు పంపించారు పోలీసులు. అక్కడి అధికారులు బాలుడిని తల్లి నిర్మలకు ఇచ్చేందుకు నిరాకరించారు. అందుకు నిబంధనలు ఒప్పుకోవని, అన్ని విధాలుగా విచారణ చేసి..  చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ నిర్ణయిస్తేనే బాలుడిని అప్పగిస్తామని నిర్మలకు వివరించారు. దీంతో చేసేదేమీ లేక, బాలుడిని వదిలేయలేక ఆ తల్లి అక్కడే పడిగాపులు కాస్తున్నది. కనీసం పాలు పట్టేందుకైనా  అనుమతివ్వాలని వారిని వేడుకున్నది. కండ్లముందున్న బాబును హత్తుకోలేక, గుక్కెడు పాలు పట్టలేక తల్లడిల్లిపోయింది.

ఆ తల్లి పడుతున్న బాధను చూడలేక స్థానిక మీడియా ప్రతినిధులు పలువురు వెంటనే ఈ విషయాన్ని హైదరాబాద్‌ సీడబ్ల్యూసీ చైర్‌పర్సన్‌ శ్యామల దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఆమె శిశువిహార్‌ అధికారులతో మాట్లాడి, నిర్మలతోపాటు ఆమె కూతురికి స్టేట్‌ హోంలోనే ఆశ్రయం కల్పించారు. కరోనా పరీక్షలను నిర్వహించిన తరువాత బాలుడికి పాలను పట్టించారు. చిన్నారిని హత్తుకుని మురిపాలను పట్టి ఆ తల్లి మురసిపోయింది. ఈ సందర్భంగా సీడబ్ల్యూసీ చైర్‌పర్సన్‌ శ్యామల మాట్లాడుతూ.. పూర్తిగా విచారణ నిర్వహించిన అనంతరమే బాలుడిని తల్లి నిర్మలకు అప్పగిస్తామని, అప్పటివరకు వారికి అక్కడే ఆశ్రయం కల్పిస్తామని స్పష్టంచేశారు. 

కన్నతండ్రే విక్రయించిన వైనం.. 

నాగర్‌కర్నూల్‌ జిల్లాకు చెందిన నిర్మల-రాజు దంపతులు మలక్‌పేట పరిధిలోని నల్లగొండ చౌరస్తా వద్ద ఉన్న చర్చి సమీపంలో  ఫుట్‌పాత్‌పైనే కొన్నిరోజులుగా నివసిస్తున్నారు. భిక్షాటన చేసుకుంటూ పొట్టపోసుకుంటున్నారు. వారికి ఒక పాప, రెండు నెలల బాబు ఉన్నాడు. రోజువారీగా డిసెంబర్‌ 25వ తేదీ రాత్రి పిల్లాడిని పక్కలో వేసుకుని నిర్మల నిద్రపోయింది. మధ్యరాత్రి వేళ మెలకువరాగా పక్కలో బాబు కనిపించకపోవడంతో ఉలిక్కిపడింది. వెంటనే చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించింది. ఎక్కడా ఆచూకీ లభించకపోవడంతో చాదర్‌ఘాట్‌ పోలీసులను ఆశ్రయించింది. 


logo