హైదరాబాద్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ) : ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల పట్ల నిర్లక్ష్యం, వివిక్షను విడనాడి ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలని సెకండరీ గ్రేడ్ టీచర్స్ యూనియన్(ఎస్జీటీయూ) రాష్ట్ర అధ్యక్షుడు కరివేద మహిపాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి అరికెల వెంకటేశం డిమాండ్ చేశారు. ప్రాథమిక పాఠశాలల బలోపేతానికి 10వేల పీఎస్ హెచ్ఎం పోస్టులను మంజూరు చేయాలని కోరారు.
ఎస్జీటీయూ ఆధ్వర్యంలో ఆదివారం ‘చలో ఇందిరాపార్క్’ సందర్భంగా భారీ ధర్నా నిర్వహించారు. పలు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున టీచర్లు తరలివచ్చారు. సీపీఎస్‌ను రద్దుచేసి, పాత పింఛన్‌ను పునరుద్ధరించాలని, పండిత ప్రమోషన్లతో నష్టపోయిన ఎస్టీజీలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లోని టీచర్లకు టీచర్ ఎమ్మెల్సీ ఓటు హక్కు కల్పించాలని కోరారు.