చందుర్తి, మే 26: భూ వివాదంలో ఓ మహిళను కొడవలితో దారుణంగా నరికి చంపిన ఓ నిందితుడు.. ఆపై పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో సోమవారం సాయంత్రం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చందుర్తికి చెందిన బొల్లు మల్లవ్వ (57)కు సమీప బంధువు రౌడీషీటర్ బొల్లు మనోజ్‌కు మధ్య కొద్దిరోజులుగా భూవివాదం కొనసాగుతున్నది. ఈ క్రమంలో మనోజ్ ఆమెపై కక్ష పెంచుకున్నాడు. సోమవారం మల్లవ్వ గ్రామ శివారులోని తన వ్యవసాయ పొలం, పశువుల కొట్టం వద్దకు వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా మనోజ్ కొడవలితో ఆమెపై దాడి చేశాడు.
తల, చేతులపై అతి కిరాతకంగా నరికాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా, అప్పటికే మల్లవ్వ మృతి చెందింది. నిందితుడు కొడవలితో వెళ్లి పోలీసులకు లొంగిపోగా, వేములవాడ ఠాణాకు తరలించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని మల్లవ్వ కుటుంబ సభ్యులు, బంధువులు వేములవాడ-కోరుట్ల ప్రధాన రహదారిపై ఆందోళనకు దిగారు. పోలీసుల హామీతో ఆందోళన విరమించారు. ఘటనపై ఇంకా కేసు నమోదు కాలేదు. నిందితుడు రెండేండ్ల క్రితం చందుర్తిలో గంగారం అనే వృద్ధుడిని హత్య చేశాడు.