Fathers Day | నాన్న మందలించాడని ఇంటి నుంచి పారిపోయిన ఓ కొడుకు ఫాదర్స్ డే నాడు ఇంటికి చేరాడు. తండ్రి అన్న నాలుగు మాటలు భరించలేక రోషంతో ఊరు కాని ఊరెళ్లి రోడ్ల మీద తిరుగుతున్న యువకుడికి ఓ న్యాయవాది బుద్ధి చెప్పి తండ్రి చెంతకు చేర్చాడు. చెట్టంత ఎదిగిన కొడుకు కనబడకుండా పోయాడని దిగులుతో ఉన్న ఆ తండ్రికి అప్పగించి అతని కండ్లలో ఆనందం నింపాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో ఆదివారం జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణానికి చెందిన రాహుల్ రాజ్ డిగ్రీ పూర్తి చేశాడు. స్థానికంగా ఒక మెడికల్ ఏజెన్సీలో పనిచేస్తున్నాడు. తండ్రి రాజేందర్‌తో ఇటీవల రాహుల్‌కు మనస్పర్థలు వచ్చాయి. దీంతో తండ్రితో గొడవ జరగడంతో మనస్తాపం చెందిన రాహుల్.. మూడు రోజుల కిందట ఇల్లు విడిచిపెట్టి వచ్చేశాడు. ఇల్లు వదిలి వేములవాడ పట్టణానికి చేరుకున్న రాహుల్ అక్కడే పనికోసం తిరిగాడు. ఈ క్రమంలో పట్టణ ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు, న్యాయవాది పిల్లి మధును ఆశ్రయించాడు. ఏదైనా ఉద్యోగం ఉంటే చేస్తానని కోరాడు. దీంతో సదరు యువకుడిని చేరదీసిన పిల్లి మధు.. అతని తల్లిదండ్రుల గురించి ఆరా తీశాడు.
రాహుల్ తండ్రితో గొడవపడి వచ్చాడని తెలియడంతో అతనికి పిల్లి మధు బుద్ధి చెప్పాడు. ఆ తర్వాత అతని తండ్రికి సమాచారం అందించాడు. ఆదివారం వేములవాడకు వచ్చిన తల్లిదండ్రులకు రాహుల్‌ను అప్పగించాడు. జాగ్రత్తగా చూసుకోవాలని సూచించాడు. ఇంట్లో నుంచి పారిపోయిన కొడుకు ఎక్కడ ఉన్నాడో తెలియక ఆందోళన చెందుతున్న తమకు ఫాదర్స్‌డే నాడు కొడుకు దొరకడం పట్ల ఆ తండ్రి రాజేందర్ హర్షం వ్యక్తం చేశాడు. తమ కుమారుడిని అప్పగించిన పిల్లి మధుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పాడు.