అలంపూర్, నవంబర్ 9 : న్యాయవాదుల రక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాలని హైకోర్టు బార్ కౌన్సిల్ సభ్యుడు హన్మంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. విధి నిర్వహణలో భాగంగా చాలామంది న్యాయవాదులు దాడులకు గురయ్యారని, అంతేకాక కొన్ని ప్రాంతాల్లో దుండగుల చేతుల్లో ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగిందని తెలిపారు. న్యాయవాదులతోపాటు వారి కుటుంబాల పరిరక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యేక చట్టం అమలు చేయాలని కోరారు.
ఆదివారం గద్వాల జిల్లా అలంపూర్‌లోని జోగుళాంబ బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయం నుంచి న్యాయవాదుల చలో హైదరాబాద్ పాదయాత్రను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఈ పాదయాత్ర ఈ నెల 14న హైదరాబాద్ చేరుకొని గవర్నర్, ముఖ్యమంత్రి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలిసి వినతిపత్రాలు సమర్పించనున్నట్టు పేర్కొన్నారు. మహబూబ్‌నగర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అనంతరెడ్డి, సీనియర్ న్యాయవాది నారాయణరెడ్డి మాట్లాడుతూ.. గత కొన్ని సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం, డిమాండ్లను నెరవేర్చుకునేందుకు పాదయాత్ర చేపడుతున్నట్టు తెలిపారు.