ఏపీ ప్రభుత్వం చేపట్టిన గోదావరి బనకచర్ల ప్రాజెక్టు తెలంగాణకు ఘోర శాపంగా మారనుంది. కృష్ణా జలాల తరహాలోనే గోదావరి జలాలనూ చెరబట్టే కుతంత్రం ఇందులో దాగి ఉంది.
వరద జలాల పేరిట గోదావరి-బనకచర్ల లింక్ ద్వారా గోదావరి జలాలను పెన్నా బేసిన్‌కు మళ్లించే కుట్రను అమలు చేస్తున్నది. అందులో భాగంగానే నిబంధనలన్నీ అతిక్రమిస్తూ పోలవరం ప్రాజెక్టు పనులను నిర్వహిస్తున్నది.
రోజుకు ఒక టీఎంసీ మేరకు జలాలను తరలించేందుకు కాల్వలు తవ్వాల్సి ఉన్నా దాదాపు 4 టీఎంసీల సామర్థ్యంతో పనులు చేపట్టింది. పోలవరం డెడ్ స్టోరేజీ నుంచి కూడా జలాలను సీమాంధ్రకు తరలించే వ్యూహంతో ముందుకు సాగుతున్నది.
అంతిమంగా ఇది బేసిన్‌లోని తెలంగాణకు తీరని నష్టాన్ని చేకూర్చనున్నది. ఏపీ కుట్రలను ముందునుంచే మాజీ సీఎం కేసీఆర్ పసిగట్టడంతో పాటు, అడుగడుగునా అడ్డుకున్నారు. కానీ ఇప్పుడు గోదావరి జలాలు మొత్తం బేసిన్ బయటకు తరలిపోయే ప్రమాదముంది.
దీనిపై ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం..
Banakacherla | గోదావరిలో వరద ప్రవాహాలు ప్రధానంగా ప్రాణహిత, దాని దిగువన ఉన్న ఇంద్రావతి, శబరి నదుల నుంచే వచ్చి చేరుతాయి. ఆ జలాలపై కన్నేసిన ఏపీ ఇప్పుడు వాటిని మొత్తంగా జీబీ లింక్ ద్యారా తరలించేందుకు సిద్ధమైంది. అందుకు అనుగుణంగా ముందునుంచే నిబంధనలన్నీ తుంగలో తొక్కి పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను నిర్వహిస్తున్నది. పోలవరం ప్రాజెక్టు ద్వారా రోజుకు ఒక టీఎంసీ మేరకు జలాలను తరలించేందుకు 12 క్యూసెక్కుల సామర్థ్యంతో కుడి, ఎడమ కాలువలను తవ్వాల్సి ఉన్నా అంతకు మూడింతలు సామర్థ్యంతో పనులను నిర్వహిస్తున్నది. ఒక్కో కాలువ ద్వారా రోజుకు 4 టీఎంసీల చొప్పున 8 టీఎంసీల జలాలను మళ్లించేందుకు వీలుగా పనులను చేస్తున్నది. మరోవైపు ఆయా కాలువలపై ఇప్పటికే లెక్కకు మించి ఇతర ఎత్తిపోతలను అక్రమంగా ఏర్పాటుచేసింది. ఏకంగా పోలవరం డెడ్ స్టోరేజీ నుంచి కూడా జలాలను సీమాంధ్రకు తరలించే వ్యూహంతో ముందుకు సాగుతున్నది.
ట్రిబ్యునల్ అవార్డుకు విరుద్ధంగా పోలవరం నిర్మాణ సామర్థ్యాలను ఏపీ విస్తరించింది. టీఏసీకి (టెక్నికల్ అడ్వయిజరీ కమిటీ) సమర్పించే సమయంలో డ్యామ్ ఎండీడీఎల్‌ను 145 నుంచి 141 ఫీట్లకు కుదించింది. తద్వారా లైవ్ స్టోరేజీ కెపాసిటీని 28.31 నుంచి 75 టీఎంసీలకు పెంచింది. కుడి కాలువ సామర్థ్యాన్ని 10 వేల క్యూసెక్కుల నుంచి 12 వేల క్యూసెక్కులకు, ఎడమకాలువ సామర్థ్యాన్ని 8 వేల క్యూసెక్కుల నుంచి 12 వేల క్యూసెక్కులకు పెంచింది. ఆ మేరకు టీఏసీ అనుమతులను సాధించింది. కానీ క్షేత్రస్థాయిలో ఆ సామర్థ్యాలకు విరుద్ధంగా కుడి, ఎడమ కాలువలను 17,500 క్యూసెక్కుల సామర్థ్యంతో నిర్మించడం ప్రారంభించింది. రెండు కాలువల మార్గంలో ఉన్న సొరంగాలను ఏకంగా 40 వేల క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యంతో నిర్మిస్తున్నది. నిబంధనలకు విరుద్ధంగా ఏపీ పోలవరం ప్రాజెక్టు పనులు చేపడుతున్నదని, ఈ అంశాలను ఉటంకిస్తూ బేసిన్‌లోని రాష్ర్టాలు అనేకసార్లు కేంద్రానికి ఫిర్యాదు కూడా చేశాయి. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ సైతం ఆయా అంశాలను ఉటంకిస్తూ కేంద్రానికి లేఖలు రాసింది.
హైదరాబాద్, జనవరి 16 (నమస్తే తెలంగాణ): సాగు, తాగు, పారిశ్రామిక అవసరాల కోసం పోలవరం ప్రాజెక్టు నిర్మించాలని 1978లో అప్పటి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. ఈ మేరకు డీపీఆర్‌ను నాటి బచావత్ ట్రిబ్యునల్ ఎదుట సమర్పించింది. ఆ వివరాల ప్రకారం 150 ఎఫ్‌ఆర్‌ఎల్‌తో పోలవరం వద్ద డ్యామ్ నిర్మించాలి. ప్రాజెక్టు ఎండీడీఎల్ 145 అడుగులు కాగా, మొత్తం డ్యామ్ లైవ్ స్టోరేజీ 28.31 టీఎంసీలుగా ఉండాలి. డ్యామ్ నుంచి కుడి కాలువను 10 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో తవ్వి గోదావరి జలాలను కృష్ణా రివర్‌కు కలపాలి. డ్యామ్ నుంచి ఎడమ కాలువను 8 వేల క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యంతో తవ్వి గోదావరి జలాలను విశాఖపట్నం వరకు తరలించాలి. ఏపీ ప్రతిపాదనలపై గోదావరి బేసిన్లో భాగమైన నాటి మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా రాష్ర్టాలు అనేక అభ్యంతరాలు లేవనెత్తాయి. తుదకు గోదావరి నుంచి మళ్లించే జలాల్లో రైపేరియన్ రాష్ర్టాలకు వాటాలు పంచడంతోపాటు, ఇతర షరతులతో ఏపీ ప్రాతిపాదనలకు బచావత్ ట్రిబ్యునల్ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. కానీ ఆ తర్వాత ఆచరణలో ఏపీ ప్రభుత్వం మాత్రం ట్రిబ్యునల్ అనుమతులకు విరుద్ధంగా క్షేత్రస్థాయిలో ప్రాజెక్టు, కాలువ సామర్థ్యాలను విస్తరించుకుంటూ పోతున్నది.
టీఏసీ అనుమతులకు విరుద్ధంగా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కాలువలు, ఇతర నిర్మాణాల సామర్థ్యాన్ని ఇష్టారాజ్యంగా పెంచుకుంటూ పోతున్న ఏపీ ప్రభుత్వం, మరోవైపు అనుమతుల్లేకుండానే అనేక లిఫ్ట్ స్కీమ్‌లను ఏర్పాటుచేస్తూ గోదావరి జలాల మళ్లింపు చేపట్టనున్నది. అపెక్స్ కౌన్సిల్, సీడబ్ల్యూసీ అనుమతులు లేకుండా, రాష్ట్ర విభజన చట్టానికి విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం గోదావరిపై అక్రమంగా పలు ప్రాజెక్టులు నిర్మిస్తున్నది. పోలవరం ఎడమ కాలువపై పురుషోత్తమపట్నం లిఫ్ట్‌ను ఇప్పటికే ఏర్పాటు చేసింది. కుడికాలువపై పోలవరం ప్రాజెక్టులో భాగంగా ఉన్న ఆయకట్టుకు నీటిని అందించేందుకు తాత్కాలికంగా పట్టిసీమ, పుష్కర లిఫ్ట్‌లను ఏర్పాటు చేస్తామని, పోలవరం డ్యామ్ అందుబాటులోకి వచ్చిన తర్వాత వాటిని తొలగిస్తామని చెప్పింది. కానీ ఆచరణలో ఆ రెండింటింతోపాటు చాగల్నాడు, తొర్రిగడ్డ, తాడిపూడి, తదితర ప్రాజెక్టులను ఏర్పాటు చేసి గోదావరి జలాలను తరలిస్తున్నది. అదేవిధంగా వెంకటనగరం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, చింతపూడి రెండో దశల ప్రాజెక్టులను కూడా చేపట్టింది. ఇదిలాఉంటే పోలవరం జలాశయం డెడ్ స్టోరేజీ నుంచి నీటిని వాడుకునేందుకు ఏపీ ప్రభుత్వం కొత్తగా పోలవరం ఎత్తిపోతల పథకం పనులను కూడా చేపట్టడం గమనార్హం. పోలవరం డ్యామ్ డెడ్ స్టోరేజీ నుంచి కూడా 18 టీఎంసీలను తరలించేందుకు వీలుగా ఈ ఎత్తిపోతల పథకాన్ని రూపొందించి పనులు నిర్వహిస్తున్నది. వీటిపై తెలంగాణ ఇప్పటికే సీడబ్ల్యూసీకి, కేంద్రానికి, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు (జీఆర్ఎంబీ)కు, పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)కి అనేకసార్లు లేఖలు రాసింది. గతంలో పోలవరం ప్రాజెక్టు క్షేత్రపర్యటనకు వెళ్లిన కేంద్ర అధికారులు సైతం అక్రమ ప్రాజెక్టును గుర్తించడంతోపాటు, ఆ పనులు నిలిపేయాలని కూడా ఆదేశించినా ఏమాత్రం పట్టించుకోకుండా పనులు కొనసాగిస్తున్నది. పర్యావరణ అనుమతులను ఉల్లంఘించారని ఎన్జీటీ సైతం పోలవరం, చింతలపూడి, పురుషోత్తమపట్నం, పట్టిసీమ తదితర ప్రాజెక్టు పనుల మొత్తానికి రూ.248 కోట్ల జరిమానాను విధించిందంటే ఏపీ తీరును అర్థం చేసుకోవచ్చు.
వాస్తవంగా బచావత్ ట్రిబ్యునల్ ఉమ్మడి ఏపీకి గోదావరిలో 1486 టీఎంసీలు కేటాయించింది. ఇందులో తెలంగాణ ప్రాజెక్టులకు 968 టీఎంసీలు, ఏపీ వాటా 518 టీఎంసీలని తేల్చింది. కానీ ఏపీ ప్రభుత్వం ఇప్పటికే తన వాటాకు మించి దాదాపు 776 టీఎంసీలను వినియోగించుకునేందుకు అనుమతులు లేకుండా పలు ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టింది. ఇప్పుడు అదనంగా రోజుకు 2 టీఎంసీల చొప్పున మొత్తంగా 200 టీఎంసీలను తరలిస్తామంటూ జీబీ లింక్ ప్రాజెక్టును చేపట్టేందుకు సిద్ధమైంది. కానీ వాస్తవంగా 350 టీఎంసీలతో గోదావరి-కృష్ణా-పెన్నా నదుల అనుసంధానం పనులను ఏపీ సర్కారు క్షేత్రస్థాయిలో నిర్వహిస్తున్నది. పెన్నా బేసిన్లో ఇప్పటికే ఆ మేరకు నీటినిల్వ సామర్థ్యం ఉండడం గమనార్హం. సోమశిల, కండలేరు, ఆవులపల్లి తదితర అనేక రిజర్వాయర్లను నిర్మించింది. పోతిరెడ్డిపాడు ద్వారా ఆయా రిజర్వాయర్లకు కృష్ణా జలాలను ఏటా అక్రమంగా మళ్లిస్తూనే ఉన్నది. ఇప్పుడు గోదావరి జలాలను కూడా ఆ మేరకు పెన్నా బేసిన్‌కు తరలించేందుకు ఏపీ వేగంగా పావులు కదుపుతున్నది. ఏపీ చర్యల ఫలితంగా గోదావరి డెల్టా సిస్టమ్ తీవ్ర ప్రభావానికి గురవుతుందని సాగునీటి రంగ నిపుణుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. కేసీఆర్ హయాంలో ప్రాజెక్టు పనులు చేపట్టేందుకు ఏపీ వెనకడుగు వేసింది. కానీ ప్రస్తుతం మన రాష్ట్రంలో తమ అనుకూల ప్రభుత్వం రాగానే ఏపీ ఇప్పుడు మరింత దూకుడు పెంచింది. గోదావరిని చెరబట్టే పనుల్లో ముందెన్నడూ లేని వేగం పెంచింది.
ఇప్పటికే టీఏసీ అనుమతులకు విరుద్ధంగా ఇష్టారాజ్యంగా కాలువలను విస్తరించుకుంటూ పోతున్న ఏపీ ప్రభుత్వం, తాజాగా గోదావరి బనకచర్ల లింక్ పేరిట ఆయా కాలువలను మరింత విస్తరించేందుకు పూనుకున్నది. పోలవరం కుడి కాలువకు సమాంతరంగా 1400 క్యూసెక్కులను తాడిపూడి కాలువను 80 కిలోమీటర్ల పొడవుతో ఇప్పటికే నిర్మించింది. ఆ కాలువను ప్రస్తుతం ప్రకాశం బరాజ్ వరకు అంటే 105 కిలోమీటర్లు పొడగించడంతోపాటు, కాలువ ప్రవాహసామర్థ్యాన్ని కూడా 1400 క్యూసెక్కుల నుంచి 10 వేల క్యూసెక్కులకు విస్తరించాలని నిర్ణయించింది. పోలవరం కుడికాలువ ప్రవాహ సామర్థ్యాన్ని కూడా 28 వేల క్యూసెక్కులతో ప్రస్తుతం చేపడుతున్నది. మొత్తంగా గోదావరి నుంచి రోజుకు నికరంగా 38 వేల క్యూసెక్కులు అంటే దాదాపు నాలుగు టీఎంసీల జలాలను తరలించే అవకాశమున్నది. ఇదీ ఏపీ ప్రభుత్వం కాగితాల మీద చెప్తున్న లెక్క. కానీ ఆచరణలో ఒక్కో కాలువ ద్వారా రోజుకు 4 టీఎంసీల చొప్పున మొత్తం 8 టీఎంసీలను తరలించే సామర్థ్యంతో పనులు చేస్తున్నది.