హైదరాబాద్ సిటీబ్యూరో, జులై 18 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న కొత్త ఆటోల కొనుగోలులో భారీ కుంభకోణానికి కుట్ర జరుగుతున్నదని ఆరో పణలు వెల్లువెత్తుతుతున్నాయి. సుమారు రూ.1,400 కోట్ల స్కామ్‌కు కుట్ర జరిగినట్టు బీఎంఎస్, బీపీటీఎంఎం ప్రధాన కార్యదర్శి రవిశంకర్ అట్లూరి ఆరోపించారు. ఒక్కో ఆటోపై సుమారు రూ.70 వేలు అదనంగా వసూలు చేస్తున్నారని చెప్పారు. కాచి గూడలోని ఓ షోరూమ్‌లో కొన్ని యూనియన్ల నాయకులు ప్రత్యేక కౌంటర్లు తెరిచి, దరఖాస్తుల వివరాలను అప్లోడ్ చేయిస్తుండగా.. వారిని బీఎంఎస్ నాయకులు అడ్డుకున్నారు.
అనంతరం ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడుతూ అర్హత గల ఆటో డ్రైవర్లను పక్కనపెట్టి.. బినామీల పేరుతో ఆటోలు కొనుగోలు చేస్తున్నది ఎవరో.. ప్రభుత్వం, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సమగ్ర విచారణ జరిపి, నిజాలు నిగ్గుతేల్చాలని డిమాండ్ చేశారు. సీఎన్జీ ఆటో రూ.2.40 లక్షల ఉండగా రూ.3.10 లక్షలకు అమ్ముతున్నారని చెప్పారు. ఎల్పీజీ ఆటో రూ.2.30 లక్షలు ఉంటే.. రూ.3 లక్షలకు అమ్మారని వివరించారు. కొందరు యూనియన్ నాయకులు తీసుకొచ్చే దరఖాస్తులను మాత్రమే డీలర్లు అప్లోడ్ చేస్తున్నారని తెలిపారు.